హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రెవెన్యూ శాఖలోని సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తం శ్రీనివాసులును అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై శ్రీనివాసులు ఇంట్లోనేగాక అతని బంధువుల, స్నేహితుల, బినామీల నివాసాలు సహా మొత్తం ఆరుచోట్ట ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులుకు చెందినట్లుగా పేర్కొంటున్న భారీ మొత్తపు విలువైన స్థిర, చరాస్తులను కనుగొన్నారు.

తెలంగాణా, ఏపీ, కర్నాటక సహా మొత్తం మూడు రాష్ట్రాల్లో ఏడీ శ్రీనివాసులుకు చెందిన ఆస్తులను గుర్తించారు. మైహోం భుజాలో ఓ ఫ్లాట్, నారాయణపేటలో రైస్ మిల్లును, కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపూర్ లో మరో 11 ఎకరాల సేద్యపు భూమి, మహబూబ్ నగర్ లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో మూడు ప్లాట్లను కనుగొన్నారు. అదేవిధంగా రూ. 5.00 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, ఒక్కోటి చొప్పున కియా, టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్లు శ్రీనివాసులుకు చెందిన ఆస్తులుగా ఏసీబీ తనిఖీల్లో గుర్తించింది.

