హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు సహా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీపై సైఫాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈనెల 7వ తేదీన అసెంబ్లీ గేట్ నెం. 3 వద్ద జరిగిన పరిణామాల్లో మహిళా కానిస్టేబుల్ కె. పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది.
కేసులో వరుస నిందితులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేటీఆర్ ఇతరులను పేర్కొన్నారు. నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దుర్భాషలాడి, బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీ షర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో తెలిపారు. తమకు కేటాయించిన విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారని, ఘటనలో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఆయా నాయకుల ప్రవర్తన వల్ల తాము సిగ్గుతో తల దించుకున్నట్లు వీడియోల్లో స్పష్టంగా ఉందన్నారు.టీ షర్టులు విప్పి, బూతులు తిట్టారని ఘటన పూర్వపరాలను సవివరంగా ప్రస్తావించారు. ఈమేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై ఆయా నాయకులపై మహిళా కానిస్టేబుల్ పద్మావతి ఇచ్చి ఫిర్యాదు ప్రతిని దిగువన చూడవచ్చు..


