హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జరిగిన అవమాన ఘటనపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. ఆయా అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సీఎం రేవంత్ సమాధానమిచ్చారు.
శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, ఈ విషయంలో స్పీకర్ కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. “ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లిని అవమానించారు” అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
“మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతికి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టేనని, దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదన్నారు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డదిగా చెబుతూ సీఎం హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ సభాపతి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని సీఎం చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించిందన్నారు. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించామన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన ఘటనలపై ప్రత్యేక విచారణకు సీఎం ఆదేశించారు. విచారణాధికారిగా విజయ్ కుమార్ ను నియమించారు.

