Top 5 This Week

Related Posts

ఎవరికీ పట్టని ఖమ్మం ఎంపీ., RRRకు చేదు అనుభవం!

ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి ఎవరికీ పట్టడం లేదా? ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఆయనను పట్టించుకోవడం లేదా? నాయకుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు సైతం ఎంపీని ఖాతరు చేయడం లేదా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని అన్వయించుకోవలసిన అనివార్య దృశ్యం మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలోనే సాక్షాత్కరించింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవపు ఘటనపై ఎంపీ రఘురాంరెడ్డి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ అర్థంతరంగా కలెక్టరేట్ నుంచి వెళ్లిపోవడం రాజకీయంగానే కాదు, అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెడితే..

ఖమ్మం జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించతలపెట్టారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే జిల్లాకు చెందిన మంత్రులు సహా ఎమ్మెల్యేలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాల్సిన ఈ సమావేశంలో ఎంపీ రఘురాంరెడ్డి చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది.

మంత్రులు, ఎమ్మెల్యేల గైర్హాజరుతో ఖాళీ కుర్చీల మధ్య ఎంపీ రఘురాంరెడ్డి

సమయపాలన పాటిస్తూ ఎంపీ రఘురాంరెడ్డి కలెక్టరేట్ కు చేరుకుని సమావేశం నిర్వహణకు సంసిద్ధమయ్యారు. అయితే సమావేశానికి మంత్రులతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పగలు 12 గంటల నుంచి జిల్లాలో అందుబాటులో ఉన్నప్పటికీ, ముందే నిర్దేశించుకున్న ప్రకారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో పర్యటించారు. డిప్యూటీ సీఎం భట్టి వెంటే జిల్లా కలెక్టర్ అనుదీప్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన బర్త్ డే రోజున కూడా అటు హైదరాబాద్ లోగాని, ఇటు ఖమ్మంలోగాని అందుబాటులో ఉండరని అధికారిక ప్రకటన వెలువడింది. బీహార్ ఎన్నికల్లో పరిశీలకునిగానూ పొంగులేటి వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ పరిణామాల్లో ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా ‘దిశ’ సమావేశానికి హాజరు కాలేకపోయారు.

అసహనానికి గురై అర్ధంతరంగా వేదిక దిగి వెళ్లిపోతున్న ఎంపీ రఘురాంరెడ్డి

ఇక మిగిలింది సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మాత్రమే. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తన నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు కేంద్రాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేగాక తల్లాడ రైతు వేదికలో, సత్తుపల్లిలో నిర్వహించిన మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకల్లోనూ ఆమె పాల్గొన్నారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కూడా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. కానీ సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేల్లో ఎవరు కూడా ‘దిశ’ మీటింగ్ కు హాజరు కాలేదు.

అయినప్పటికీ ఎంపీ రఘురాంరెడ్డి ‘దిశ’ సమావేశాన్ని నిర్వహించేందుకు సంసిద్ధమయ్యారు. తొలుత సివిల్ సప్లయిస్ శాఖపై సమీక్ష నిర్వహించేందుకు నివేదికను కోరారు. ఆ తర్వాత విద్యాశాఖ నివేదిక కోసం, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీల గురించి సమాచారం కోసం ఎంపీ ప్రశ్నించగా, స్పందించే అధికారులు కనిపించలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎంపీ రఘురాంరెడ్డి తనకు కనీసం సమాచారం ఇస్తే సరిపోతుంది కదా? అందరూ ఉన్నపుడే మరోసారి సమావేశం నిర్వహించుకుందామంటూ అర్థంతరంగా వేదిక దిగి విసవిసా వెళ్లిపోయారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లోనే కాదు, అధికార గణంలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే రఘురాంరెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాత్రం ఉండడం గమనార్హం.

Popular Articles