Top 5 This Week

Related Posts

సమ ప్రాధాన్యతతో సంక్షేమం, అభివృద్ధి: మంత్రి పొంగులేటి

ఖమ్మం: ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికీ సమ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయన ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం బోదులబండలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం చిన్నకోరుకొండ గ్రామంలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడుతున్న చిన్నకోరుకొండి – కిష్టారం, వైరా – నెమలి రహదారులు మధ్య ఉన్న లింక్ రోడ్ కు, రూ. 6కోట్ల 30లక్షల వ్యయంతో లోకవరం పెనుబల్లి రహదారి పై హైలెవల్ బ్రిడ్జి పనులకు, కల్లూరు ప్రధాన రహదారి లో రూ.93 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు, తిరువూరు ఎక్స్ రోడ్ కల్లూరు జంక్షన్ వద్ద రూ.8కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం నుండి అశ్వారావు పేట జాతీయ రహదారి జంక్షన్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళల సాధికారత, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తోందన్నారు. ప్రజలు అందించిన ఆశీస్సులు, దీవెనల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా పాలన కొనసాగుతోందన్నారు.

తాను కల్లూరు మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, పాలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సత్తుపల్లి నియోజకవర్గం కూడా తన సొంత ప్రాంతమేనని పొంగులేటి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని, ఇప్పటికే సుమారు రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles