(సమీక్ష ప్రత్యేక కథనం)
గత నెల 23వ తేదీన ‘సమీక్ష’ ఓ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. నక్సల్ రహిత దేశంగా ప్రకటించే అంశంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీ సుప్రీం లీడర్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోందన్నది ఆ వార్తా కథనపు సారాంశం. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిల లొంగుబాటుకు ముందు ‘సమీక్ష’ ఈ విశేష వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
నక్సల్స్ రహిత దేశంగా ప్రకటించేందుకు ఎంచుకున్న డెడ్ లైన్ మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ దినపత్రికలు సైతం ఇదే అంశం ప్రామాణికంగా తాజాగా వార్తా కథనాలు ప్రచురిస్తుండడం గమానార్హం. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి ఈనెల 31వ తేదీలోగా లొంగిపోనున్నారని, ఆయన తెలంగాణా పోలీసులను సంప్రదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ తెలుగు దినపత్రిక తన మెయిన్ ఎడిషన్ లో నిన్న ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఇదీ చదవండి: గత నెల 23న ‘సమీక్ష’ ప్రచురించిన వార్తా కథనం
ఈ నేపథ్యంలోనే మరో తెలుగు దినపత్రిక శుక్రవారం కూడా గణపతి లొంగుబాటు అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంకో వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈనెల 30వ తేదీన 193 నిబంధన కింద పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయించినట్లు పేర్కొంటూ ఆసక్తకర పాయింట్ ను ఉటంకించింది. ఈ నిబంధన కింద అత్యవసర ప్రజా ప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశమున్నట్లు తెలిపింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ బైరెట్టి శబరి, శివసేన ఎంపీ ఏక్ నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించి స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించడానికి ఇప్పటికే నిర్ణయించినట్లు, తీర్మానంపై చర్చ తర్వాత నక్సలిజం అంతానికి మోదీ సర్కార్ చేపట్టిన చర్యలు, సాధించిన విజయంపై అమిత్ షా సభలో వివరిస్తారనేది ఆ వార్తా కథనపు సారాంశం.

వాస్తవానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ బి. సుమతి వంటి ఉన్నతాధికారులు ఈనెల 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన నేపథ్యంలోనే గణపతి లొంగుబాటుపై భిన్న ప్రచారంతో కూడిన వార్తా కథనాలు వచ్చాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ ఘటన, పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు సహా దాదాపు 4,000 మంది నక్సల్స్ లొంగుబాటలో పయనించిన పరిణామాల్లో గణపతి ఎక్కడ? అనేది ముఖ్యాంశంగా మారింది.

ఈ పరిస్థితుల్లో ఎంచుకున్న డెడ్ లైన్ లోగా మావోయిస్ట్ పార్టీకి పూర్తిగా తుదముట్టించి, సాధించిన విజయాన్ని ప్రకటించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు ఆయా వార్తా కథనాల ద్వారా స్పష్టవమతోంది. ఇటు ఛత్తీస్ గఢ్ లో మిగిలిపోయిన ఒకటీ, రెండు సాయుధ దళాలకోసం, సునీల్ అనే మరో కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్యంగా జార్కండ్ అడవుల్లో భారీ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ‘సమీక్ష’ గత నెల 23న ప్రచురించిన వార్తా కథనపు సారాంశానికి సారూప్యతగా గణపతి లొంగుబాటు కీలక ఘట్టంతోనే నక్సల్ రహిత దేశంగా కేంద్రం ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

