Top 5 This Week

Related Posts

‘హైడ్రా రంగనాథ్’పై హైకోర్టు ఆదేశం.. సీఎం కీలక స్పందన

ఢిల్లీ: హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవీ రంగనాథ్ ను తొలగించాలని, మరో అర్హత గల అధికారిని ఆ స్థానంలో నియమించాలంటూ తెలంగాణా హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నిన్న జారీ చేసిన ఆదేశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఓ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వానికి గల విచక్షణాధికారమని, ఈ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని వ్యాఖ్యానించారు.

చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వాళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కోర్టు ధిక్కరణ అంటున్నారని, కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను మార్చాలనే నిబంధనంటూ ఉంటే గతంలో సోమేష్ కుమార్ పై 400 కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయని సీఎం అన్నారు. ఆరోజు ఇవన్నీ ఏవీ మాట్లాడలేదని, ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ఆ ప్రభుత్వం యొక్క విచక్షణగా చెబుతూ, ఆ విచక్షణాధికారాన్ని ఎవరూ గుంజుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు.

న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసముందని, తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కుంటామన్నారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అతిగొప్ప సంస్కరణ హైడ్రా.. అని సీఎం అన్నారు. హైడ్రాను బెస్ట్ సంస్థగా ప్రశంసిస్తూ, ఈ సంస్థ కొట్టేదే బడా బాబులను… అని అన్నారు. పార్కులు, చెరువులు, కుంటలు ఆక్రమించుకుంటే కూల్చేస్తామని, హైడ్రా పనే అది.. అని చెప్పారు.

బతుకమ్మ కుంటవంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్లు కబ్జా పెట్టుకున్నరని, ముఖీం అనే కబ్జాకోరు..వందల ఎకరాలు కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించామన్నారు. ఎన్ కన్వెన్సన్ పేదవాళ్లదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వస్తే విమానంలో పూలవర్షం కురింపిచన ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు బతుకమ్మ కుంటను కబ్జా చేశారన్నారు. బతుకమ్మ కుంటలోని పదెకరాలను ఆక్రమించుకుని అమ్ముకుంటే పూలవర్షమేంటి? కనకవర్షమే కురిపించొచ్చు.. అని సీఎం వ్యాఖ్యానించారు.

ఇటువంటి కబ్జాదార్లను కాపాడడానికి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని, హైడ్రా కార్యాచరణపై, బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఆక్రమించుకన్నవాళ్లు, ధనవంతులైనా, పేదలైనా ఒకటే చర్య ఉంటుందన్నారు. హైడ్రాపై హైరోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తప్పకుండా గౌరవిస్తామన్నారు. అదేవిధంగా హైడ్రా తీసుకుంటున్న చర్యలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Popular Articles