విజయవాడ: తన కూతురు అంజలి పెళ్లి వేదిక వివాదంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ‘ఎక్స్’ ఖాతా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. బెంగళూరులోని యలహంక ప్రాపర్టీ వేదికగా పెళ్లి జరపాలని నిర్ణయించిన సందర్భంలో ఏర్పడిన వివాదం వేళ ఆమె కీలక ప్రకటనను తన ఎక్స్ ఖాతాపై విడుదల చేశారు. ఆయా ప్రకటన దిగువన యథాతథంగా..
‘‘నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.’’


