ఖమ్మం: ప్రజల భద్రత కోసమే ‘కనెక్ట్ కమ్యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ‘కనెక్ట్ కమ్యూనిటీ’ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లి కేసీఆర్ కాలనీలో నగర పోలీసులు ‘కనెక్ట్ కమ్యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇటీవల కాలంలో టేకులపల్లి లోని కేసీఆర్ టవర్ ప్రాంతంలో కొంతమంది గంజాయి సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. సిటీ ఏఆర్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఈగల్ ఫోర్స్, క్లూస్ టీమ్ విభాగాలకు చెందిన మొత్తం 286 మంది పోలీసులు, అధికారులు ‘కనెక్ట్ కమ్యూనిటీ’లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా కేసీఆర్ టవర్ ప్రాంతంలోని 52 బ్లాక్ లలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకుని స్ధానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధం 105 మంది వేలిముద్రలు తీసుకొని పరిశీలించారు. గంజాయి అమ్ముతున్న ఇద్దరిని, గంజాయి సేవిస్తున్న 12 మందిని, 50 గ్రాముల పొడి గంజాయి, ముగ్గురు చోరి నిందితులను, ఇద్దరు అనుమానితులు గుర్తించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ ప్రాతంలో స్థానిక ప్రజలు కోరుకున్నట్లు పోలీస్ పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేస్తామన్నానరు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు సూచించారు.

కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేటి ప్రజల అప్రమత్తతే రేపటి వారి పిల్లల భద్రమైన భవిష్యత్తుగా పేర్కొన్నారు. గంజాయి విక్రయదారుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి గంజాయి రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరిస్తూ యువత భవిష్యత్తును కాపాడటంలో భాగస్వాములు కావాలన్నారు.
అదేవిధంగా స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని సునీల్ దత్ అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నారు.

అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అలాగే ఆన్ లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా అపరిచితుల పట్ల అప్రమత్తంగా వుండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తునట్లయితె స్థానిక పోలీసులకు కాని డయల్ 112కు సమాచారం ఇవ్వాలని అన్నారు.
అదేవిధంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి చిరునామా, ఆధార్ కార్డులు చూసిన తరువాతనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఇలాంటి అకస్మిక తనీఖీలు నేరస్థులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు దోహదపడుతుందన్నారు. నేరాల నియంత్రణ కోరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు , బ్లూకోల్ట్స్ సిబ్బంది ఆయా ప్రాంతల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాటు పాత నేరస్థుల సమాచారాన్ని సేకరిస్తారని చెప్పారు. స్ధానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సీసీయస్ ఏసీపీ సర్వర్, సీఐలు సాదిక్ పాషా, చిట్టిబాబు, కరుణాకర్, శివప్రసాద్, నాగరాజు, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

