Top 5 This Week

Related Posts

ఖమ్మం-దేవరపల్లి హైవేపై జర్నీ… ఎప్పుడంటే..?

వచ్చే జూలై నెల 15వ తేదీకల్లా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారగణానికి సూచించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి వేంసూరు నుండి ధంసలాపురం వరకు ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే గుండా మంత్రి తుమ్మల గురువారం ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ, క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే జిల్లాలో 3 ప్యాకేజులుగా విభజించిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పనులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, సమస్యలు గురించి తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలిపారు. జూలై 15వ తేదీకల్లా సంపూర్ణంగా పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు.

ప్యాజేజి-1 కింద తల్లంపాడు నుండి సోమవరం వరకు 30 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం రూ. 772.11 కోట్ల అంచనాలతో చేపట్టగా, 75 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. ఈ ప్యాకేజీలో 32 స్ట్రక్చర్లు ఉండగా, 29 పూర్తయ్యాయని తెలిపారు. ధంసలాపురం వద్ద ఎన్ఎస్పీ కాల్వలో పిల్లర్ల విషయమై అలైన్మెంట్ లో కాస్త ఆలస్యం జరగ్గా, ప్రస్తుతం పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు.

ప్యాకేజి-2 క్రింద సోమవరం నుండి చింతగూడెం వరకు 27 కి.మీ. మేర రూ. 637.11 కోట్ల అంచనాలతో పనులు చేపట్టినట్లు, ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీలో 39 స్ట్రక్చర్లకు గాను 35 నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు.

హైవేపై రైతులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల

అదేవిధంగా ప్యాకేజి-3 క్రింద చింతగూడెం నుండి రేజర్ల వరకు 38 కి.మీ. మేర రూ. 804.69 కోట్ల వ్యయ అంచనాలతో పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. ఈ ప్యాకేజి కి సంబంధించి 55 స్ట్రక్చర్లు ఉండగా, 51 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు.

పనుల పురోగతికి ఎటువంటి సమస్యలు లేవని, అన్ని ప్యాకేజీలలో పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో సర్వీస్ రోడ్ విషయమై ప్రతిపాదనలు సమర్పించి, మంజూరు చేయిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంతం యావత్తూ వ్యవసాయ ప్రాంతమని, సర్వీస్ రోడ్ చాలా అవసరమని మంత్రి అన్నారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే లో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 3 ఎగ్జిట్లు ఉన్నాయని, దేశంలోని ఏ రాష్ట్రంలోని నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవేలో 3 ఎగ్జిట్లు లేవని మంత్రి అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ మెరుగవుతుందని తెలిపారు. మంత్రి వెంట సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.

Popular Articles