‘చట్టబద్ధమైన పాలన గెలవాలి, వ్యక్తుల పాలన కాదు..
వ్యక్తుల పాలన గెలిస్తే, అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుంది..
ఇది చట్టబద్ధమైన పాలనపై వ్యక్తుల పాలన పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన ఒక చక్కటి ఉదాహరణ..’
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ అనంతరం తెలంగాణా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలివి..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పోస్టు నుంచి తప్పించాలని, అతని స్థానంలో మరొకరిని నియమించాలని హైకోర్టు ఈనెల 27వ తేదీన ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈమేరకు తీర్పు కాపీని హైకోర్టు వెలువరించింది. హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించింది. మరో అధికారిని నియమించాలని సీఎస్‌కు సూచించింది.
శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో ఇచ్చిన మొత్తం 56 పేజీల ఆదేశపు తీర్పులో హైడ్రా ‘ధిక్కరణ’ వ్యవహారాలను అంశాలవారీగా, కేసులవారీగా హైకోర్టు ఉటంకించింది. ఈ ఉత్తర్వులో చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానానికి పూర్తి అవగాహన ఉందని కూడా జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ పేర్కొన్నారు. తాతా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ ఆదేశంలో ఉదహరించింది. రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని జారీ చేసిన ఉత్తర్వులోని చివరి పేజీలో జస్టిస్ అనిల్ కుమార్ పేర్కొన్న ఆంగ్ల భాషలోని వ్యాఖ్యలు యథాతథంగా..
“Rule of Law has to prevail NOT Rule of Men.
If Rule of Men prevails, it’s a death knell for Democracy.
This is a classic case of Rule of Men trying to prevail over Rule of Law,
A fallacy which shall remain a Dream in a True Democracy like ours.”

