Top 5 This Week

Related Posts

‘రాఘవ కన్ స్ట్రక్షన్స్’పై సీఐడీ విచారణ: సీఎం రేవంత్

హైదరాబాద్: మంత్రి పొంగులేటి కుటుంబీకులకు సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ సహా పలు సంస్థల మైనింగ్ పై సీఐడీ విచారణకు తెలంగాణా ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రి పొంగులేటిపై బురద జల్లి, లొంగదీసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రతీ రెడ్డికి ఇంకో రెడ్డి బంధువు అవుతారని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు.

రాఘవ కన్ స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందని, దీనిపై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేవారు. ఇదే సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును హరీష్ రావు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 2014 జూన్ నుంచి రాష్ట్రంలో జరిగిన మైనింగ్ వ్యవహారాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.

సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావులపై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణకు సిద్ధమన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్ కంపెనీకి నోటీసులిచ్చి, ఫైన్లు, పెనాల్టీలు వేసి, అతన్ని లొంగదీసుకుని, అతని కంపెనీని రాయించుకున్న వ్యవహారంపైనా, అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధమని ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్ తో పాటు వీటన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

అక్రమ మైనింగ్ పై విపక్షాల ఆరోపణలు: ఇదీ సీఎం రేవంత్ సమాధానం.. ఆయన మాటల్లోనే..

‘‘ప్రతిపక్ష నాయకులు పదే పదే వారి దశాబ్ద కాలం పాలనలో మైనింగ్ అక్రమాలపై, మా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ కోరుతున్నారు. వారి కోరిక మేరకు, తెలంగాణ ప్రజలకు నిజాలను నిగ్గుతేల్చేలా సిబీసిఐడి లాంటి సంస్థలతో విచారణకు ఆదేశిస్తున్నా. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు, దళితులను లారీ ఎక్కించి తొక్కించి చంపి, అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ల తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

అదే విధంగా సర్వే నెంబర్ 168 శిరీషా జియో గ్రానైట్స్, దీనికి సంబంధించిన దాని మీద విచారణ అదే విధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి ఈరోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతే ఉన్నడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్ గా మైనింగ్ చేసుకొని ఏదైతే దోపిడీ జరిగిందో.. వాళ్ళ తమ్మున్ని స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డడో, మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం.

శ్వేతా గ్రానైట్స్, గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు, మాజీ మంత్రి వాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని, కాబట్టి శ్వేతా గ్రానైట్స్ కు సంబంధించిన శాసనసభ్యులు గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈరోజు విచారణకు ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

గాయత్రి గ్రానైట్స్ వద్దిరాజు రవిచంద్ర, ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి, ఫైన్లు, పెనాలిటీలు వేసి, అతన్ని లొంగదీసుకొని, వాటిని మళ్లీ తగ్గించి, ఆర్బిట్రేషన్ లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రానైట్స్ ను ఏదైతే రాపించుకున్రో, వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ ల మీద ఈరోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు అక్రమాలు చేసుంటే దాని మీద కూడ విచారణ చేపడుతాం.. వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు పూర్తి వివరాలు, ఆధారాలతో ప్రభుత్వం నివేదికతో సిద్దంగా ఉంటుంది’’

Popular Articles