హైదరాబాద్: తనకు ఏ శాఖ ఇచ్చినా కళ్లు మూసుకుని పని చేస్తానని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరిగే ఏ పని చేయడానికీ తాను భయపడనని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, రేపటి నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. ఏరియాను బట్టి యాభై నుంచి వంద శాతం వరకు పెంపు ఉంటుందని, ప్రైమ్ ఏరియాలో నూరు శాతం పెంపు ఉంటుందన్నారు. భూముల విలువ పెంపుతో ప్రభుత్వానికి రూ. 12.00 కోట్ల నుంచి రూ. 1,400 కోట్ల ఆదాయ సమకూరుతుందన్నారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఇక నుంచి రిజిస్ట్రార్లకు మినిమమ్ పవర్స్ మాత్రమే ఉంటాయన్నారు.
కాగా ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశమే లేదని, రద్దు చేయడం బీఆర్ఎస్ కు సాధ్యం కాదన్నారు. తాము ఎవరికీ ఉచితంగా భూములు ఇవ్వడం లేదని, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వానికి అది సాధ్యమా? అని ప్రశ్నించారు. త్వరలోనే తహశీల్దార్ల బదిలీలు ఉంటాయని పొంగులేటి చెప్పారు. తెలంగాణా రెవెన్యూ శాఖను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలో 90 శాతం గ్రామాల సర్వే పూర్తవుతుందన్నారు.
రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తున్నామని, అందుకే ఏసీబీ దాడులు, తనిఖీలు, సోదాలు జరుతున్నట్లు చెప్పారు. తాను వచ్చాక రెవెన్యూలో ఏసీబీ ఫైల్స్ అన్నీ క్లియర్ చేశానని, గత ప్రభుత్వంలో మూడేళ్ల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. తాను బాధ్యతలు చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే 3,500 రెవెన్యూ ఫైల్స్ క్లియర్ చేశానని పొంగులేటి తెలిపారు.
రాష్ట్రంలో అసైన్డ్ భూములకు ఓ పాలసీని తీసుకువస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక వాటిని నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని, కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేయనందువ్లలే ముఖ్యమంత్రి ప్రకటన చేయలేదన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంలో తనతోపాటు ముఖ్యమంత్రి స్పష్టంగా ఉన్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
జర్నలిస్ట్ ల ఇంటి స్థలాల విషయంలో నీను, సిఎం స్పష్టంగా ఉన్నాం..
ఫ్యూచర్ సిటి రద్దు చేయడం సాధ్యం కాదు
ఫ్యూచర్ సిటి లో ల్యాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదు
రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.. అది సాధ్యమా.. పొంగులేటి
ప్రతిపక్షం నేతలు ఏదైనా మాట్లాడుతరు.. నమ్మొద్దు

