ఖమ్మం: కలప రవాణా కోసం అటవీ అధికారులు జారీ చేసే పర్మిట్ల ట్యాంపరింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులను ఖమ్మం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుడు డిసెంబర్ నెలలో ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు తర్వాత, దర్యాప్తు అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ చెప్పారు.
సీసీఎస్ ఏసీపీ సర్వర్ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన రాధేశ్యామ్, సూర్యాపేట జిల్లా మోతె మండలం గోప్యా తండాకు చెందిన కొర్ర శివ అనే వ్యక్తులు ఫారెస్ట్ అధికారులు జారీ చేసిన కలప రవాణా పర్మిట్లను ట్యాంపరింగ్ కు పాల్పడ్డారు. నల్ల తుమ్మ కర్ర సరఫరా కోసం ఖమ్మం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు నుంచి ఇతర వ్యక్తుల పేరు మీద వీళ్లు పర్మిట్లు తీసుకుని ట్యాంపిరింగ్ చేసేవారు. పర్మిట్ నల్ల తుమ్మ కర్రకు ఉంటే, దాని స్థానంలో సండ్ర కర్రగా మార్చి ట్యాంపరిండ్ చేసేవారు.
తద్వారా మహబూబాబాద్, కురవి, సీరోల్, అయ్యగారిపల్లి తదితర ప్రాంతాల నుంచి సండ్ర చెట్లను నరికించి, ట్యాంపరింగ్ పర్మిట్ల ద్వారా కొర్ర శివ విజయవాడకు చెందిన దళారి రాధేశ్యామ్ కు విక్రయించేవాడు. ఈ తరహాలో రవాణా చేసిన సండ్ర కర్రను రాధేశ్యామ్ మధ్యప్రదేశ్ లోని జాబువా పట్టణంలోని ఏఎం ఎంటర్ ప్రైజెస్ అబ్ధుల్ రహేమాన్ కు సరఫరా చేసేవాడు. మధ్యప్రదేశ్ లో సండ్ర కర్రను కిళ్లీల్లో వాడే కత్తా తయారీకి వినియోగిస్తారు.
ఈ విధంగా సుమారు తొమ్మిది లారీల సండ్ర కర్రను శివతోపాటు రాధేశ్యామ్ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేవారని, కలప రవాణా పర్మిట్ల ట్యాంపరింగ్ కు పాల్పడిన రాధేశ్యామ్ ను, శివను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సర్వర్ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన సీసీఎస్ రాజ్ కుమార్ గౌడ్ ను, ఎస్ఐ వంశీ, కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది హరి, జానీ, నరసింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని, ఇతరుల ప్రమేయాన్ని కూడా గుర్తించి అరెస్ట్ చేయనున్నట్లు ఏసీపీ చెప్పారు.

