ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో ఖమ్మం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అనుమానితులు, సాక్షులు సహా మొత్తం 24 మందికి లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరీక్షల కోసం పోలీసులు అభ్యర్థించిన 24 మందిలో కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందినవారు ఉండడం గమనార్హం.
గత అక్టోబర్ 31వ తేదీన సీపీఎం నాయకుడు సామినేని రామారావు ఆయన స్వగ్రామమైన చింతకాని మండలం పాతర్లపాడులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు పురోగతి లభించలేదు. పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు సహా సుమారు 30 మంది వరకు టీంలుగా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరిపినప్పటికీ, హత్యకు గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు రూఢీ కాలేదు. హంతకులెవరనేది దర్యాప్తులో తేలలేదు.
ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పోలీసు శాఖ 24 మందికి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించింది. ఇటువంటి పరీక్షల అంశంలో అనుమానిత వ్యక్తులుగాని, సాక్షులుగాని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా పరీక్షలకు కోర్టు అనుమతించే అవకాశమున్నట్లు సమాచారం. పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై మొత్తం 24 మందిలో ఆరుగురు మాత్రమే ఇప్పటి వరకు లై డిటెక్టర్ పరీక్షలకు అంగీకరించారు. దీంతో వారికి ఆయా పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు వారిని బెంగళూరుకు సోమవారం తరలించారు.

