మేడారం: తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసారి మేడారం మహా జాతర ప్రాంగణం వేదిక కాబోతోంది. ఈనెల 18వ తేదీన మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఈనెల 19వ తేదీన మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. జాతర ఆధునికీరణ పనులను సీఎం రేవంత్ 19వ తేదీన ప్రారంభించనున్నారు.
అయితే అంతకు ముందురోజు సాయంత్రానికి సీఎం మేడారం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ నేపథ్యంలోనే 18వ తేదీన సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నప్పటికీ, టూర్ షెడ్యూల్ కు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సీపీఐ వందేళ్ల సభకు సీఎం రేవంత్ హాజరవుతారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇదే సందర్భంగా ఖమ్మంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, నోటిఫికేషన్ వెలువడకుంటే పనిలో పనిగా ఏదులాపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.
మేడారంలో నిర్వహించే కేబినెట్ మీటింగులో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురించి, వచ్చేనెల 1వ తేదీన కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ పై, రైతు భరోసా నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే ఖమ్మంలో సాయంత్రం వరకు జరిగే సీపీఐ సభకు హాజరైన తర్వాత హెలీకాప్టర్ ప్రయాణం వీలవుతుందా? రోడ్డు మార్గంలోనే సీఎం మేడారం వెడతారా? అనే ప్రశ్నలపై స్పష్టత లేదు. సాయంత్రం వరకు సీఎం పర్యటన ఖమ్మంలోనే సాగితే ఇక్కడి నుంచి మేడారం వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.
ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలోనే సీఎం వెళ్లాల్సి వస్తే కొత్తగూడెం, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం మీదుగా దాదాపు 235 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. మరో మార్గమైన ఇల్లెందు, గుండాల, పస్రా మీదుగా మేడారం చేరుకోవాలంటే 165 కి.మీ. ప్రయాణించాలి. అయితే ఇది పూర్తిగా అటవీ మార్గం కావడం గమనార్హం. ఈ రెండు మార్గాలు కాకుండా మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి, ములుగు మీదుగా వెడితే మాత్రం 190 కి.మీ. ప్రయాణించాలి. మొత్తంగా 18వ తేదీన ఇటు ఖమ్మం కార్యక్రమాల్లో పాల్గొనే సీఎం అదేరోజు సాయంత్రానికి మేడారం చేరుకోవడం, అక్కడే కేబినెట్ మీటింగ్ నిర్వహించే విధంగా టూర్ షెడ్యూల్ ఎలా ఖరారవుతుందనే అంశంపై ఇప్పటికైతే స్పష్టత లేదు.

