అల్లు కనకరత్నానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు దివంగత అల్లు కనకరత్నం చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.
సుప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, మెగాస్టార్ చిరంజీవి అత్త, ప్రముఖ నిర్మాత అరవింద్ మాతృమూర్తి కనకరత్నం ఆగస్టు 30వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె దిశదినకర్మ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగింది. ఈ కార్యానికి హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ రవిచంద్ర తదితరులు అల్లు కనకరత్నం కుమారుడు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, శిరీష్ తదితర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


