Top 5 This Week

Related Posts

‘ప్రజా దర్బార్’లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పాలేరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులను పంపించి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తున్నామని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా దరఖాస్తులు స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

ప్రజల నుంచి వినతి పత్రం స్వీకరిస్తున్న మంత్రి పొంగులేటి, పక్కన కలెక్టర్ దివాకర

ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును పార్టీలకతీతంగా పరిష్కరిస్తామన్నారు. కొన్ని దరఖాస్తులను ఇక్కడే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సాదా బైనామా, భూమి రికార్డు సమస్యలు, నిషేధిత జాబితా సమస్యలు వంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ప్రజా దర్బార్‌లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని, గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణానికి నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు.

కాగా గట్టు సింగారం గ్రామానికి చెందిన షేక్ సకీనా అనే వికలాంగురాలికి రెండు గంటల వ్యవధిలోనే వీల్ ఛైర్ ను మంత్రి ఆదేశంతో అధికారులు సమకూర్చారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు పి. శ్రీనివాసరెడ్డి, పి. శ్రీజ, ఆర్డీవో శ్రీనివాస్ స్థానిక తహశీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Popular Articles