Top 5 This Week

Related Posts

“వనజీవి” మనకు స్ఫూర్తి కావాలి: మంత్రి తుమ్మల

పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెం గ్రామంలో స్వర్గస్తులైన పద్మశ్రీ వనజీవి (దరిపల్లి) రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వనజీవి రామయ్య ప్రకృతి ప్రేమికుడిగా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించిందని, జీవితంలో చివరి క్షణం వరకు మొక్కలు నాటారని మంత్రి తెలిపారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య వృక్షో రక్షతి రక్షితః అంటూ జీవితాంతం మొక్కల పెంపకంతో గడిపారని, మొక్కలు పెంచితే మానవ సమాజానికి మంచిదనీ, పచ్చదనం ఉంటేనే మనుషులు బతుకుతారు అనీ నమ్మే రామయ్య, చదువు లేకపోయినా, చిన్న కుటుంబం ఐనా మొక్కలు పెంచడం కోసం జీవితాన్ని అర్పించారని మంత్రి కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వనజీవి రామయ్యకు ఏది అవసరమైతే ఆ సహాయం అందించడం జరిగిందని అన్నారు. సామాన్యులు మంచి పని సంకల్పం చేసుకొని చేస్తే ఏ స్థాయికి వెళ్తారో చెప్పేందుకు వనజీవి రామయ్య ఉదాహరణ అని అన్నారు.

వనజీవి రామయ్య భౌతిక కాయం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా ఆయన గుర్తుగా తలా ఒక మొక్క నాటి సంరక్షించాలని, అప్పుడు రామయ్య ఆత్మ శాంతిస్తుందని మంత్రి పేర్కొన్నారు. వనజీవి రామయ్య స్ఫూర్తి మనమందరం కొనసాగించాలని, ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు ఐనా ప్రతి ఒక్కరూ పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు

Popular Articles