పాలేరు: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో భాగంగానే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెంలో పర్యటించారు. స్థానిక ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.4 కోట్ల 85 లక్షల వ్యయంతో అదనపు వసతి గృహం, డైనింగ్ హాల్, వంటగది, అదనపు తరగతి గదులు, టాయిలెట్ బ్లాక్‌లు, వంట షెడ్లు, ఓవర్ హెడ్ ట్యాంక్, సోలార్ ఫెన్సింగ్ తదితర మౌళిక వసతుల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.
అదేవిధంగా ఖమ్మం రూరల్ మండల పరిధిలో రూ.7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. డాక్యా తండాలో రూ.1.41 కోట్లతో మంగళగూడెం–డాక్యా తండా రోడ్డు, పల్లెగూడెంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం నుంచి ఎన్.ఎస్.పీ. మీదుగా పల్లెగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
తిరుమలాయపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి పర్యటించారు. పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పాపాయిగూడెంలో రూ. 2 కోట్ల 40లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం -వరంగల్ ఆర్&బీ రోడ్ నుండి తెట్టెలపాడు మీదుగా పాపాయిగూడెం వరకు చేపట్టిన బీ.టీ. రోడ్డు నిర్మాణ పనులకు, జూపెడ గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. మేడిదపల్లి ఆర్టీసీ బస్ షెల్టర్ ను, అలాగే గ్రామంలో నిర్మాణ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రూ.21 వేల కోట్లతో రైతన్నపై రుణభారం తగ్గించినట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడిగా పేర్కొన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్‌కు ధీటుగా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని, ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తల సలహాల, సూచనలు రైతులు పాటించాలని ఆయన కోరారు.
ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ పి. శ్రీజ, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఏదులాపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

