ఖమ్మం: మాదకద్రవ్యాల వినియెగాన్ని రూపుమాపేందుకు జిల్లా వ్యాప్తంగా ఖమ్మం పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే అంశపై పోలీసు అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్ర మత్తం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పప రిణామాలపై విద్యార్థులు, ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
జీవితాలను నాశనం చేసుకోవద్దు: ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి
యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం నగర ఏసీపి రమణమూర్తి అన్నారు. మత్తు పదార్దాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నగరంలోని స్టెమ్ పార్క్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ, దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, యువతపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడడం మన అందరి బాధ్యతగా ఉద్భోదించారు.

చెడు స్నేహాల వల్ల లేదా పరిస్థితుల ప్రభావంతో తాత్కాలిక ఆనందం కోసం గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక రుగ్మతల భారిన పడతారన్నారు. మాదకద్రవ్యాలు సేవించడం, సరఫరా చేయడం, తయారీ, క్రయవిక్రయాలు అన్నీ క్రిమినల్ నేరాలని, ఇందుకు కఠినశిక్షలు ఉంటాయన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్లు వాటి నుంచి విముక్తి కోసం స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా ఉండదన్నారు. ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని ఏసీపీ రమణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ భానుప్రకాష్, ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు దృష్ట్యా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి గత జీవితంతో పాటు కుటుంబంపైనేగాక, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. తిరుమలాయపాలెం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుబడి ఉన్నారని చెప్పారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఏసీపీ తిరుపతిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంజీవ్, ఎస్సై జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

