Top 5 This Week

Related Posts

తుది దశకు భూభారతి పోర్టల్: మంత్రి పొంగులేటి కీలక సమీక్ష

హైదరాబాద్: భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకుంది. రైతులకు పారదర్శకమైన సేవలందించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రూపొందించినట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నట్లు ప్రకటించారు. భూసర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. అంతా ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. స‌చివాల‌యంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, ఎన్ఐసీ అధికారుల‌తో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ ని రూపొందించామన్నారు. నారాయ‌ణ‌పేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేట మండ‌లాల్లో ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు. పైల‌ట్ మండ‌లాల్లో మెరిట్- డీమెరిట్ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి వాటికి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి రెండో ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమ‌లు చేస్తామన్నారు.

స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ, ప్ర‌తి భూలావాదేవీ వివ‌రాలు పార‌ద‌ర్శ‌కంగా క‌నిపించేలా ఈ పోర్ట‌ల్‌ను రూపొందించినట్లు తెలిపారు. పోర్ట‌ల్‌లో ప్ర‌ధానంగా స‌మాచారం, స‌ర్వే, క‌రెక్ష‌న్, అప్పీల్, రిజిస్ట్రేష‌న్ సేవ‌లతోపాటు సిటిజ‌న్ డాష్ బోర్డు సేవ‌ల‌కు సంబంధించి మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డ‌ర్స్‌, రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ వివ‌రాలు, ఫీడ్‌బ్యాక్‌, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్‌, భూధార్ నెంబ‌ర్‌, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, మ్యూటేష‌న్, ఈసీ, మార్కెట్ విలువ‌, విలేజ్ మ్యాప్‌, ప్ర‌తి స‌ర్వేనెంబ‌ర్‌కు మ్యాప్‌, గ్రామాల న‌క్షా, పాస్ బుక్ క‌రెక్ష‌న్‌, వంటి పూర్తి స‌మాచారం, సేవ‌లు ల‌భించేలా మూడు విభాగాల‌ను అనుసంధానం చేస్తూ భూభార‌తి పోర్ట‌ల్ సకల సమాచారంతో సేవలందిస్తుందని వివరించారు.

రైతులు ఆధార్ నెంబరుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా భూభారతి పోర్టల్లో లాగిన్ అయ్యి భూములకు సంబంధించిన వివరాలను పొందవచ్చన్నారు. రిజిస్ట్రేష‌న్‌, ఇత‌ర భూసేవ‌ల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ మొదలు ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌తి స్థాయిలో వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఖాతాదారునికి స‌మాచారం అందుతుందని చెప్పారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో 36 మాడ్యూల్స్ ఉండ‌గా భూభార‌తి పోర్ట‌ల్‌లో ఒకే ఛాప్ట‌ర్ కింద తీసుకువ‌చ్చినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Popular Articles