Top 5 This Week

Related Posts

గరికపాటి ‘గుడ్డు రాజకీయం’ వెనుక ఇంత కుట్ర ఉందా!?

గరికపాటి నరసింహారావు వ్యక్తి కాదు, ఒక రాజకీయ లక్ష్యం కోసం దారిదీపం..
ఆధ్యాత్మిక దారిలో ధార్మిక ప్రబోధకునిగా పేరొందిన ‘గరికపాటి’ గుడ్డు రాజకీయం ప్రజల్లో బాగా బట్టబయలైనది. అది మంచి పరిణామం. అదే సమయంలో మరో కీలక చీకటి కోణం కూడా దాగి వుంది. ఆ కోణాన్ని కూడా బహిర్గతం చేసి తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది.

గుడ్డు వంటి రకరకాల సంక్షేమ పథకాలను తెరవెనక నుండి సర్కార్లతో రద్దు చేయించడానికి బడా కార్పొరేట్ వ్యవస్థ వ్యూహాలు పన్నుతుంది. వాటి అమలుకై పలు వ్యూహాత్మక కర్తవ్యాల్ని చేపడుతుంది. వాటిలో గుడ్డు రాజకీయం ఒకటి!

సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో రద్దు చేసి కల్తీలేని సంక్షేమ రహిత ఫాసిస్టు రాజ్య నిర్మాణం చేయడం బడా కార్పొరేట్ వ్యవస్థ లక్ష్యాల్లో ఒకటి. వాటిని చేపట్టాల్సిన ఫాసిస్టు పాలకుల దారికి అనువైన పరిస్థితులను అది తెర వెనకనుండి సృష్టిస్తుంది. ఆ దారిలో సర్కార్లు చేపట్టే రద్దుల ప్రక్రియకు ఆటంకాలు లేకుండా దేశ ప్రజలను, ముఖ్యంగా విద్యాధిక మధ్యతరగతి ప్రజలను మానసికంగా సంసిద్ధం చేస్తుంది.

ఆ ప్రక్రియలో కుహనా వేదాంతులు, సిద్దాంతులు, సూక్తి ముక్తావళి ప్రబోధకులు, మత ధార్మిక బోధకులు, ధర్మ పీఠాధిపతుల వంటి వారిని తన భావజాల సైనికులుగా కార్పొరేట్ వ్యవస్థ నియామకం చేసుకుంటుంది. వారి ప్రతిభ, జ్ఞానాలను అది విశేషంగా సద్వినియోగం చేసుకుంటుంది. వారిలో గరికపాటి మొదటి వ్యక్తి కాదు… చివరి వ్యక్తి కూడా కాదు.

సత్యం, పుణ్యం, ధర్మం వంటి ధార్మిక ముసుగులో పసిపిల్లల నోటికాడి గుడ్డును రద్దు చేసే పాపిష్టి, అధర్మ కార్యాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇది చివరిది కూడా కాదు. ఈ గరికపాటి ఒక వ్యక్తి కాదు. జన జీవితాల్ని విధ్వంసం చేసే ఫాసిస్టు పాలకులకు దారి చూపే టార్చి లైట్ వంటి వారు మాత్రమే. ఫాసిస్టు రాజకీయ రహదారిలో ఓ దారిదీపం మాత్రమే. ఇలా ఆధ్యాత్మిక, ధార్మిక ముసుగులో చేపట్టే ఫాసిస్టు రాజకీయ కోణాన్ని కూడా బహిర్గతం చేద్దాం.

Popular Articles