ఖమ్మం: రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతీ గజం భూమినీ సర్వే చేసి, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌తో కూడిన ‘భూధార్’ కార్డును అందజేస్తామని తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస చెప్పారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూభారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో మంత్రి మాట్లాడారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద మధిర నియోజకవర్గంలోని ముల్గుమాడు రెవెన్యూ గ్రామంలో సర్వే పూర్తి చేసి, సుమారు 476 మంది రైతులకు మ్యాప్‌లతో కూడిన భూధార్ కార్డులను సిద్ధం చేశామన్నారు. ఈ సభా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా రైతులకు ఈ కార్డులను పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఇదే పద్ధతిలో కార్డులు ఇస్తామని పొంగులేటి పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు మొదటి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే మరో 17 వేల నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి పిల్లర్‌లోనూ అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రెండవ విడత పూర్తి చేసిందని, రాబోయే రోజుల్లో మిగిలిన విడతలను కూడా శరవేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామన్నారు.

