…ఈరోజు మేడే.. ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవం. అక్కడక్కడా జెండా దిమ్మెలకున్న కొయ్యలకు అరుణపతాకాలు రెపరెపలాడుతున్నాయి. విజయవాడ ఓ వీధిలో మట్టికొట్టుకుపోయి పెచ్చులూడుతున్న ఓ పాత పత్రికా కార్యాలయం గోడ మీదున్న నినాదం… నన్ను ఒక్కసారిగా గతంలోకి తీసుకెళ్లింది..
1986 జనవరి.. ఓరోజు మధ్యాహ్నం.. విశాఖపట్నం మద్దిలపాలెం ఆంధ్రభూమి కార్యాలయం. రిసెప్షన్ ముందున్న ఓ మహిళ ఒక్కొక్కర్నీ పైఅంతస్తుకు పంపిస్తున్నారు.
ఇప్పుడు నా వంతు..
విశాలమైన గది.. ఇద్దరో ముగ్గురో కూర్చొని ఉన్నారు.
ఒకాయన తెలుసు. ఆర్వీ రామారావు, రెసిడెంట్ ఎడిటర్.
రెండో ఆయన.. ఏదో రెడ్డి గారు, డెక్కన్ క్రానికల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ (మాజీ పోలీసు అధికారి అనగా విన్నా)
మూడో మనిషెవరో గుర్తులేదు.
…ఓ గొంతు: (‘మీ’ అన్నారో/’నీ’ అన్నారో గుర్తులేదు) పేరు?
(ఉద్యోగార్థినైన నేను చాలా ఒద్దికగా, అణకువగా)
నమస్కారం సార్. నా పేరు అమరయ్య
ఇంకో గొంతు: ఏ ఊరు?
నేను: ప్రకాశం జిల్లా అడవిపాలెం సర్.
మళ్లీ ఎవరో: జర్నలిజంలోకి ఎందుకొస్తున్నావు?
నేను: (మోర పైకెత్తి) సామాజిక సేవ, సమాజంపై ప్రేమతో..
ఆర్వీ రామారావనుకుంటా:.. అబ్బా, ఏదైనా పార్టీలో చేరకపోయావా!
నేను: ఉద్యోగం కావాలి కదా!
నోరిప్పితే ఒట్టు..
మళ్లీ అదే గొంతు: ఏమైనా పుస్తకాలు చదివే అలవాటుందా?
‘చిరస్మరణ’ అని ఓ అనువాద నవల ఈమధ్య చదివా సర్.
ఏం.. తెలుగు నవల్లు చదవ్వా?
నా నుంచి మాటల్లేవ్!
కాసేపు మౌనం.. నేను రాసిన పరీక్ష ఆన్సర్ షీట్ అటుఇటు తిరగేసి..
సరే, వెళ్లు. బయట వెయిట్ చెయ్!
* * *

ఓ గంట తర్వాత..
ఎప్పుడు జాయిన్ అవుతావు?
వారంలోగా..!
ఎనిమిది నెలలు తిరిగాయి.
‘సర్, నేను మా ఊరికి వెళతా సర్..’
‘ఏమైనా పిచ్చా.. వచ్చే మార్చికి జర్నలిస్టులకు పాలేకర్ వేజ్ బోర్డ్ రాబోతోంది. అప్పుడు నీ జీతం ఎంతవుతుందో తెల్సా.. 12, 13 వందలవుతుంది. నైట్ డ్యూటీ అలెవెన్స్, క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎరన్డ్ లీవ్స్, పీఎఫ్, ఇఎస్ఐ, సినీ రివ్యూ రాస్తే మరో 50..’
‘కాద్సార్, నే వెళ్తా..’
‘మళ్లీ ఆలోచించుకో.. ఒకసారి పోతున్నావంటే ఒక ఛాన్స్ పోతున్నట్టు’ అని ఆర్వీఆర్ గట్టిగానే చెప్పారు.
‘ఉహూ…’
* * *
పేపర్ మారా!!
@Andhra Jyothi.
బెజవాడలో కొంత, తిరుపతిలో మరికొంత కాలం..
పాలేకర్ అవార్డ్ వచ్చింది. భూమిలో జీతాలు పెరిగాయి. నాకూ రూ. 1,250 ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. కానీ, మోస పోయా. ట్రైనీ సబ్ గా ఆర్డరిచ్చి జీతం 1,250 ఇచ్చారు. తిరుపతి వేశారు. దీంతో నా సీనియారిటీ గోవిందా.. పుట్టేవాళ్లకు అన్నను, పెరిగేవాళ్లకి తమ్ముణ్ణీ.. ఛీ..ఛీ.. నామీద నాకే కోపం.. బేరమాడుకోవడం కూడా చేతకాని తనం!
* * *
@seen number-3 ఆంధ్రప్రభ.
అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటున్నారు కదా.. ప్రభలో చేరితేనో.. వెతకబోయిన తీగె కాలికి తగిలినట్టు ‘ఆంధ్రప్రభ’ చెన్నై జీఎం నుంచి పిలుపు. ‘బాగా పన్జేస్తారట కదా.. నువ్వు నచ్చావు. ప్రభలో చేరం’డన్నారు.
‘చేరతా గానీ, విజయవాడ ఇస్తారా’ అన్నా.
‘ఓకే. ఇస్తాం గానీ, షరతులు వర్తిస్తాయి. మా నిబంధనల ప్రకారం మళ్లీ ట్రైనింగ్ లో చేరాలి. తర్వాత ప్రొబేషన్, ఆ పైన పర్మినెంట్! అయితే, నువ్వెక్కడో చేస్తున్నావు కనుక నేరుగా ప్రొబెషన్ ఇస్తాం. ఏడాది తర్వాత పరీక్ష రాయాలి.
మళ్లీ మొదటికి! చలో విజయవాడ!!
1989 నుంచి 2003 వరకు రామనాథ్ గోయెంకా సామ్రాజ్యం.. చట్టాలు, వేజ్ బోర్డులు, ఎరియర్స్, బదిలీలు.. అంతా చట్టప్రకారమే. బేరసారమే.
వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ఒకటుందని, అందులో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, తలకో నిర్వచనం, పత్రికా సిబ్బందికి ఓ వేజ్ బోర్డు, దానికో కథ, ఖర్జానా ఉందని, ఐదేళ్లకో పదేళ్లకో దాన్ని వేయాలని, ఆ ప్రకారం జీతాలు, ప్రమోషన్లు ఉంటాయని తెలిసింది. ఇకనేముంది గోతాలకు గోతాలు జీతాలు వస్తాయనుకున్నా..
మేమూ చేశాం సమ్మె..
పాలేకర్ తర్వాత బచావత్ వేజ్ బోర్డు.. దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ‘ఎక్స్ ప్రెస్’ యాజమాన్యం ఇవ్వలేదు. మేం సమ్మె చేశాం. యాజమాన్యం మాతో ముచ్చట.. ఓ గ్రేడ్ తగ్గించుకుని ఇంగ్లీషు వాళ్ల కంటే ఓ క్లాస్ తక్కువ వేతనాలు ఖరారు.
ఇంతలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఏపీలో రంగప్రవేశం… వస్తూనే కాంట్రాక్ట్ సిస్టం తీసుకొచ్చింది. మేము మూడు దాటి నాలుగంకెల్లోకి వస్తుంటే కాంట్రాక్ట్ లో వచ్చేవాళ్లు వస్తూనే ఐదారు అంకెల్లో వస్తున్నారు. సక్సెస్ పుల్ గా డివిజన్ వచ్చింది. మాలో మాకు తేడా వచ్చింది. అప్పటివరకు ఐక్యంగా ఉన్న వర్కింగ్, నాన్ వర్కింగ్ జర్నలిస్టులు వేరుకావడం మొదలైంది.
చట్టం కొందరికి చుట్టమైంది. కోర్టు వాళ్లకు వరమైంది. మా వేజ్ బోర్డ్ వెనకబడింది. యాజమాన్యాలు మొండికేశాయి. బచావత్ తర్వాత మనీసానా వేతన సంఘం ఏర్పాటైంది. సిఫార్సులు ఇవ్వడానికే పుష్కరకాలం పట్టింది. యాజమాన్యాలు కోర్టులకెక్కాయి. ఓ ‘దయాళువైన’ పత్రికా యజమాని స్వయంగా రాజ్యసభలోనే- ‘జర్నలిస్టులకు ఈ మాదిరి వేతనాలు ఇస్తే, ఇక మేము ఆస్తులు అమ్ముకోవడమో, లేక పత్రికలు మూసేస్కోవడమో’ చేయాలన్నారు. కోర్టులు కూడా ‘చూసీచూడనట్టు పోండని’ కొన్నేళ్లు నానబెట్టి, మా నోటికాడ కూడు తీసేశాయి.
మా చట్టం – దివిసీమ ఉప్పెనలో చిక్కుకున్న కొబ్బరిచెట్టు మాదిరి, తలతెగి వేలాడుతోంది. ‘ఆంధ్రప్రభ’ చేతులు మారింది. మాకు మా‘ముత్తా’తలు గుర్తుకొచ్చారు. చట్టం సంగతి దేవుడెరుగు, ముందు పొట్టనిండితే అంతే చాలనుకున్న చాలామంది ఎక్కడికక్కడ గోడలెక్కాం. మమ్మల్ని బేరంపెట్టిన మారాజులు పోయినచోటే ఎదిగారు. బేరసారాలు, ‘లౌక్యం’ తెలియనివాళ్లు మూతపడి మళ్లీ తెరుచుకున్న ‘ఆంధ్రజ్యోతి’వైపు కొందరు, మరికొన్నింటి వైపు మరికొందరం… అన్నీ మూసేసుకుని పొట్టబోసుకున్నాం.

* * *
2007 .. ‘సాక్షి’ అవతరించింది. జస్టిస్ జి.ఆర్. మజీథియా వేజ్ బోర్డు వచ్చింది. పాత వాటికే దిక్కులేక కొత్తదాన్ని పట్టించుకునే దెవరు? చెట్టుకొకరు పుట్టకొకరమయ్యాం.
మా చట్టం ప్రకారం వర్కింగ్ జర్నలిస్టులది మేధోశ్రమ. 6 గంటలు పనిచేస్తే చాలు. అప్పటికే మాకు ‘రాజుని మించిన రాజభక్తి’ వచ్చింది. ఇలా అలవాటుపడేలా చేయడంలో యాజమాన్యాలు ఆరితేరాయి. చూస్తుండంగానే రాజ్యాలు, రాజ్యాంగాలు మారిపోతున్నాయి.
యజమానికి ఇష్టమైతే ఉద్యోగం, కష్టమైతే ఊష్టింగ్. చచ్చినా బతికినా వాళ్లకు ఒకటే. ఒకప్పుడు ‘ఉద్యోగ భద్రత.. చేసిన పనికి వేతనం.. వేజ్ బోర్డు సిఫార్సుల అమలు’ వంటి నినాదాలు (గోడమీది) చేసిన మేము… మాకు అక్రిడిటేషన్ కార్డు, బస్సు పాస్, ఇళ్ల స్థలం ఇస్తే చాలనే దాకా వచ్చాం.
రాజ్యాంగం ముందు ఐఎఎస్ అయినా, ఐపిఎస్ అయినా, నల్లకోటు జడ్జీలైనా ఒకటే అనే మహా న్యాయకోవిదుడైన సుప్రీంకోర్టు జడ్జ్ గారు జర్నలిస్టులైనా ఒకటే అని తీర్పు ఇవ్వడంతో నోటికాడికి వచ్చిన కూడు నేలపాలైంది.
ఇంతలో మాన్యవర్ నరేంద్ర మోదీ సర్కారు మాకున్న ఏకైక దిక్కు, మా చట్టం ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ అండ్ మిస్లేనియస్ యాక్ట్ -1955’ని రద్దుచేసింది. ఇది వాడకంలో లేదన్న పేరిట 4 లేబర్ కోడ్స్ లో కలిసిపోయింది.
జర్నలిస్టు అంటే మా పితామహులు మానికొండ చలపతిరావు లాంటివాళ్లు ఇచ్చిన నిర్వచనం ఇప్పుడు లేదు. కార్మికులమా, మేధావులమా? సమ్మె మాటెత్తి బతకగలమా? మా గ్రామీణ విలేఖరికి సెంటీమీటర్ల లెక్కనైనా ఇవ్వాల్సిన 3,4 రూపాయలైనా ఇస్తారా? అని అడగ్గలమా?
2025 వర్కింగ్ జర్నలిస్టుల పాలిట దారుణమైన సంవత్సరం. పని గంటల్లేవు. పనికి తగ్గ వేతనాల్లేవ్. నిర్వచనాల్లేవ్. ఉద్యోగ భద్రత లేదు. కనీసం అపాయింట్‌మెంట్ లెటర్లు అడిగే సాహసమూ లేదు. చివరకు చట్టమే లేదు!
ఇప్పుడు మేము ఎవ్వరం?.. ఎవ్వరికీ తెలియదు.
అందుకే..,
మేడే జిందా హై.. జర్నలిస్ట్ భీ అ‘మర్ రహా’ హై!
మేడే వర్థిల్లాలి!![]()
![]()
![]()
నాలుగు లేబర్ కోడ్స్ నశించాలి!!![]()
![]()
(నేను ఇది రాస్తున్న సమయానికి చిత్తూరు జిల్లా వి.కోట మండలం ధన్నూపురంలో విలేకరి వారణాసి జగన్మోహన్‌రెడ్డి ఓరౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. కన్నీటి నివాళి జగన్)

✍️ ఆకుల అమరయ్య
(ది ఫెడరల్ ఆంధప్రదేశ్ సౌజన్యంతో)

