‘నాలుగో స్తంభం’ నిలువునా ‘వణికిన’ వేళ!
నిన్న పొద్దున్నే మిత్రుడు కొమ్మాలపాటి శరత్ కాల్ చేసి “ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం” అంటూ శుభాకాంక్షలు చెప్పగానే నా మనసు కలుక్కుమంది.
మొన్న అనంతపురంలో ఓ విలేఖరికి జరిగిన ఘోరం గుర్తుకొచ్చి రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తెల్లారేపాటికి ఈ ఫోన్… భలే నవ్వొచ్చింది. ఎవరికి స్వేచ్ఛ? ఎవరికి స్వాతంత్య్రం?
మేనేజ్మెంట్ లోని కొందరు- రాయమన్నది రాశానని చెప్పిన విలేఖరి- కాళ్లు పట్టుకుని వేడుకుంటుంటే, ఆమె మరింత రెచ్చిపోయి- ముఖం చిట్లించి, పళ్లు పటపటమని కొరికి, పెద్ద గొంతుతో అతని కాలర్ పట్టుకుని- బజారు రౌడీని గుంజినట్టు గుంజిన వీడియోలు చూస్తుంటే నాకు ఒళ్లు మండిపోయింది. ‘నాలుగో స్తంభం’ అంటూ మావాళ్లు చేసే నినాదాలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు వాటిని చూసే చిగురుటాకులా వణుకుతున్న తీరు మదిలో మెదిలింది.

ఆ విలేఖరి ఇంటికి వెళ్లి ఆయన పెళ్లాం బిడ్డల్ని పక్కకు తోసేసి తన కాలేజీ స్టాఫ్ తో వీడియో తీయించి బయటి ప్రపంచానికి వదిలారంటే ఆమెకున్న ధైర్యం ఏపాటిదో అర్థమవుతోంది.
ఆమె అంతటితో వదల్లేదు.. ఆ తర్వాత ఆమె తన మందీ మార్బలంతో అనంతపురం ప్రెస్ క్లబ్ మీద ఎగబడిన తీరు ‘అంకుశం’ సినిమాలో విలన్ బరి తెగింపును గుర్తుకు తేకమానదు.
పోనీ, ఆమేమైనా రాజకీయ నాయకురాలా అంటే అదీ కాదు. అలా అని బడా డాన్ కూడా కాదు. కేరళ నుంచి వచ్చిన వాళ్ల నాయన ఓ మెకానిక్ షాపు నడుపుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే -చదువుకున్న ఈ మహిళ ఇలా తెగబడింది. ఆమె పేరు మనీషా నాయర్. ఓ కాలేజీని నడుపుతోంది.
ఆ విలేఖరి తప్పు రాస్తే దాన్ని ఖండించడానికి, న్యాయం పొందడానికి అనేక దారులున్నాయి.

క్రిమినల్ కేసు పెట్టి బొక్కలో వేయించవచ్చు..
పరువునష్టం కేసు వేసి కోర్టుకు ఈడ్చవచ్చు..
అదీ వద్దనుకుంటే అనంతపురంలోని ప్రెస్ క్లబ్ మొదలు ఢిల్లీలోని ప్రెస్ కౌన్సిల్, ఆ పక్కనే సుప్రీంకోర్టు, బెజవాడలో హైకోర్టు దాకా లాగవచ్చు.
దీనికి బోలెడన్ని చట్టాలు, లాలు, కమిషన్లు, కాకరకాయలనేకం ఉన్నాయి.
కానీ కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు చంపేస్తారా? దౌర్జన్యం చేస్తారా? కాళ్లకు దండాలు పెట్టించుని దండాలేయిస్తారా? ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం నాలుగో స్తంభం??
మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు పని చేసే విలేఖరులు బలిపశువులుగా మారడం, బయటి వ్యక్తులు ప్రెస్ క్లబ్ వంటి సంస్థల మీద పడి వీరంగం చేయడం జర్నలిజంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట.
పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాలో ఓ ఎర్రచందనం స్మగ్లర్ కత్తివేటుకు బలైన ఓ విలేఖరి నెత్తుటి మడుగు ఇంకా ఆరకమునుపే జరిగిన ఈ దారుణం జర్నలిస్టుల బతుకు భద్రతను పరిహాసం చేస్తోంది.

అయినా, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమంటూ అభినందనలు, ఆలింగనాలు చేసుకుంటూ బతికేద్దామా! గొంతెత్తి నిరసిద్దామా..!?
ఇది కేవలం జర్నలిస్టులే కాదు-మొత్తం పౌరసమాజం ఆలోచించాల్సిన ప్రశ్న.
ఇక్కడ అసలైన స్వేచ్ఛ ఎవరికి ఉంది? నిజాయితీగా రాసేవారికా..?
లేక రాయనీయకుండా రౌడీయిజం చేసేవారా?
ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్టవేయకపోతే న్యాయం చచ్చిపోయినట్టే. అప్పుడు ‘పత్రికా స్వేచ్ఛ’ ఉత్తుత్తి మాటే.
ఇవాళ నొక్కేది ఓ విలేఖరి గొంతే కావొచ్చు, అది రేపు మీ దాకా రాదన్న భరోసా ఉందా?!

✍️ ఆకుల అమరయ్య
సీనియర్ జర్నలిస్ట్
Update:
కాగా ఈ ఘటనపై అనంతపూర్ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనంతపురంలోని శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలఫై గత రెండు రోజులుగా వార్తా కథనాలు రాశాడని, దీనిని జీర్ణించుకోలేని యాజమాన్యం వారి గుండాలతో లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపించారు.

విలేకరిని నిస్సహాయునిగా చేసి, కొట్టడం, హింసించడం చాలా బాధాకరమని జర్నలిస్టులు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పట్టణంలోని టవర్ క్లాక్ కూడలిలో ర్యాలీ, బహిరంగ ప్రదర్శన నిర్వహించారు. అక్కడ నుంచి నేరుగా ర్యాలీగా వెళ్లి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బైఠాయించి నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి వెళ్లి జరిగిన ఉదంతంపై ఫిర్యాదు చేశారు.

