స్టేషన్ బెయిల్ ఇచ్చే అంశంలో ఓ కేసులోని నిందితుల నుంచి లంచం డిమాండ్ చేసిన అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ బత్తిని రంజిత్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం..
మణుగూరు పోలీస్ స్టేషన్ లో క్రైం. నెం. 292/2025 ద్వారా నమోదైన కేసులో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ బి. రంజిత్ రూ. 40 వేల మొత్తాన్ని డిమాండ్ చేశాడు. ఈనెల 19వ తేదీనే ఈ మొత్తాన్ని లంచంగా ఎస్ఐ రంజిత్ స్వీకరించి ఉండాల్సి ఉందని, డబ్బు తీసుకుని ఫిర్యాదుదారు వెళ్లాడని, ఏసీబీ నిఘా వేసినట్లు సమాచారం లీకైందో ఏమోగాని ఆరోజు డబ్బు తీసుకోకుండా ఎస్ఐ తప్పించుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం ఇంఛార్జి డీఎస్పీ విజయ్ కుమార్ చెప్పారు.
అయితే లంచం డిమాండ్ అలాగే ఉందని, తమ వద్ద ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని, అందువల్ల ఎస్ఐపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం ఎస్ఐ రంజిత్ ను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.


