Top 5 This Week

Related Posts

ఇద్దరు సీపీఐ కీలక నేతలపై కేసు

సీపీఐకి చెందిన ఇద్దరు కీలక నేతలపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశార. రైతాంగ సమస్యపై నిర్దేశిత ప్రదేశంలో కాకుండా, మరో ప్రాంతంలో ధర్నా చేశారనే అభియోగంపై సీపీఐ నేతలపై, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసిన సీపీఐ నాయకుల్లో ఆ పార్టీ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఉన్నారు.

వివరాల్లోకి వెడితే.. తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద సీపీఐ సోమవారం ఆందోళనకు దిగింది. ఆత్మీయ భరోసా, మహాలక్ష్మి ఫించన్ల పెంపు తదితర డిమాండ్లపై సీపీఐ, దాని అనుంబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా జిల్లా కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద గుమిగూడి, వచ్చీపోయే ప్రజలకు, వాహనాలకు ఆందోళనకారులు ఇబ్బంది కలిగించినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ ప్రకటించారు. ఈ పరిణామాల్లో ఖమ్మం-సత్తుపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్లు పేర్కొన్నారు.

దీంతో సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి తోట రామంజనేయులు, గాదె లక్ష్మినారాయణ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తూరుగంటి ఆంజయ్య, కూరపాటి సునీల్ లపైనేగాక మరికొంత మందిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథపాలెంసీఐ ఉస్మాన్ షరీఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనకారులు ధర్నా చౌక్ ముందు మాత్రమే తమ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, కలెక్టరేట్ గేటు ముందు ప్రజలకు, అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Popular Articles