ఖమ్మం: జిల్లాలోని చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ హాజరవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారుల, సిబ్బందితో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమావేశమై భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, సమన్వయంపై సమగ్ర దిశా, నిర్దేశం చేశారు.
సభా ప్రాంగణం మొదలు, హెలీప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ అధికారులతో ఈ సందర్భంగా సీపీ సమీక్షించారు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్త్ విధులకు కేటాయించినట్లు చెప్పారు. నలుగురు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 58 మంది సీఐ,ఆర్ఐలు, 151 మంది ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, 1,300 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులను బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.

ట్రాఫిక్ ఆంక్షలు:
రైతు ఆశీర్వాద సభ, సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మం– బోనకల్ ప్రధాన రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం, మత్కేపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా, తదితర వాహనాలు మినహా ఖమ్మం నుండి బోనకల్ కు సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఆంక్షలు అమలులో వుంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఖమ్మం నుంచి వయా పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్, ఆంధ్రకు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి మీదుగా వెళ్లాలన్నారు. అదేవిధంగా బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మీదుగా రావాలన్నారు. ధంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి లేదన్నారు. హైదరాబాదు నుంచి మీటింగ్ కి వచ్చే విఐపి వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ లోని వల్లపురం నుంచి మీటింగ్ స్థలానికి త్వరగా చేరుకోవచ్చని సూచించారు.

రైతు ఆశీర్వాద సభ కువచ్చే వారి వాహనాల పార్కింగ్ మార్గాలు:
రైతు ఆశీర్వాద సభ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ రద్దీ నివారణకు మండలాల వారీగా ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రజలు తమకు కేటాయించిన మార్గంలో ప్రయాణించి, సంబంధిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ మండలానికి కేటాయించిన రూట్ ద్వారా మాత్రమే ప్రయాణించాలన్నారు. పోలీసు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపి వేయకుండా సభ విజయవంతానికి సహకరించాలన్నారు.

