Top 5 This Week

Related Posts

కేరళంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు

ఖమ్మం: ఆన్ లైన్ మోసపు కేసుకు సంబంధించి కేరళంలో ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. అన్ లైన్ ట్రేడింగ్, ఇన్వెస్టిమెంట్ పేరుతో పెట్టుబడులకు ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ. 94.00 లక్షల మొత్తానికి మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం ఘటన పూర్వాపరాల్లోకి వెడితే.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా పరిచయమై, ఆన్ లైన్ లో Dolat Capital investment club కంపెనీలో ట్రేడింగ్, ఇన్వెస్టుమెంట్ ద్వారా అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. ఇందులో భాగంగానే వాట్సాప్, ట్రేడింగ్ లింకుల అప్లికేషన్ ద్వారా రూ. 94.00 లక్షల మేర బాధితునితో పెట్టుబడులు పెట్టించారు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధిత ఉద్యోగి ఖమ్మం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ చేసిన నిందితులతో ఖమ్మం సైబర్ క్రైం అధికారులు ఇతర సిబ్బంది

దీంతో ఈ కేసులో ఖమ్మం సైబర్ క్రైం విభాగానికి చెందిన డీఎస్పీ ఫణీందర్, సీఐ రవికుమార్, ఎస్ఐలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకట కృష్ణారావు, నాగేంద్ర, కృష్ణప్రసాద్, స్వప్న తదితర సిబ్బంది కేసు విచారణలో ముఖ్య పాత్ర పోషించారు. డీఎస్పీ ఫణీందర్ నేతృత్వంలోని సైబర్ క్రైం పోలీస్ టీం కేరళంకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా బాధితుడు మోసపోయిన రూ. 94.00 లక్షల మొత్తంలో రూ. 13.00 లక్షలు ఇద్దరి అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఆయా మొత్తం జమ అయిన అకౌంట్ హోల్డర్స్ అశీనా (35), నిసాముద్దీన్ (42) అనే వ్యక్తులను కేరళంలోని త్రివేండ్రంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ పై ఇద్దరు నిందితులను ఖమమం తీసుకువచ్చి సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరించారు. ఈ కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర పోషించిన సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్ ను, టీంలోని ఆయా పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles