(By డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి)
మా ఆత్మకూరు (అమరచింత) సంస్థానంలో దసరాఉత్సవాలు,
ఒక నెమరు..
ఆత్మకూరు సంస్థానాన్ని అమరచింత సంస్థానంగా కూడా పేర్కొంటారు. ఎందుకంటే రాజధాని సౌలభ్యం కోసం సంస్థానాధీశులు వివిధకాలాల్లో తమ రాజధాని ప్రాంతాన్ని వివిధ ప్రాంతాలకు తరలించి అమరచింత మొదలుకుని పర్దిపురం దుప్పల్లి తిప్పుడంపల్లి ఆత్మకూరు ప్రాంతాలను ఎంచుకొని పరిపాలించారు. వీటిలో అమరచింత తొలి రాజధాని. ఆత్మకూరు చివరి రాజధాని…! ఈ ప్రాంతాలు ఎక్కువకాలం రాజధానిగా కొనసాగడంతో పాటుగా ప్రజా ప్రయోజకరమైన కార్యక్రమాలు ఈ ప్రాంతాల నుండి కొనసాగాయి.
▪పూర్వ పరిచయం:
సంస్థానం వ్యవస్థాపకులు ముక్కెర గోపాలరెడ్డి. కాకతీయుల మహా సేనాని గోన గన్నారెడ్డి తండ్రి గారైన మహా సామంతరాజు గోన బుద్దారెడ్డి గారి ఆశీస్సులతో ముందుగా మగతలనాడుగా పిలవబడిన మఖ్తాల ప్రాంతాన్ని నాడగౌడగా సా. శ 1268-1278 వరకు సంస్థానాన్ని పాలించాడు.
1680 ప్రాంతంలో రాజా చెన్నారెడ్డి సంస్థానం ఏర్పాటు చేశాడు .
సా. శ. 1720 నుండి 1730 వరకు సంస్థానాన్ని పాలించిన రాజాతిమ్మారెడ్డి వారు సా. శ. 1730వ సంవత్సరంలో పరమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తూ, అక్కడే చెరువు కూడా తవ్వించాడు. ప్రస్తుతం ఈ గుడి చెర్ల పరమేశ్వరస్వామి ఆలయంగా పిలవబడుతూ పట్టణానికి ముఖద్వారముగా ఉన్నది. వాస్తవానికి ఈ స్వామి పేరు నగరేశ్వర స్వామి. ఈ గుడి నిర్మాణం నాటికి ఆత్మకూరుకు పట్టణ స్వరూపం లేదు.
సంస్థానాన్ని సా. శ. 1813-1834 వరకు పాలించిన రాజాపెద్దవెంకటరెడ్డి 1820 లో ఆత్మకూరుకు పునాదులు వేశాడని లభిస్తున్న వివరాల ప్రకారం తెలుస్తున్నది. ఈ విధంగా 1820లో ఊరిలో పాలన కోసం కోటతో పాటుగా, ప్రజల కోసం పేటలు (వాడలు ) నిర్మించబడ్డాయి. అంటే ఆత్మకూరు వయసు అక్షరాలా 200 ఏండ్లు పైచిలుకు మాత్రమే !
▪రాజా సీతారాంభూపాల్:
ఆత్మకూరులో దసరా ఉత్సవాలు గురించి చెప్పుకుంటే.. దసరా పండుగ నేపథ్యంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆత్మకూరు సంస్థానాధీశుల్లో రాజా సీతారాంభూపాల్ గారిది ప్రత్యేక చరిత్ర. వీరు సా.శ 1858 నుండి 1905 వరకు సంస్థాన భాధ్యతల్ని వహించాడు. వీరి కాలంలోనే అనేక సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఆత్మకూరు నుండి గ్రామాలకు దారులు వేయించడం, తోటలు పెట్టించడం, ఆత్మకూరులో తన హయాంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేయడం వంటి ప్రయోజనాత్మక పనుల్ని చేపట్టడంతో పాటుగా అమ్మాపురం గ్రామంలో రాజప్రాసాదంగా భవంతిని నిర్మించాడు. వీరు తిరుపతి వెంకటకవులు వంటి ఉద్దండ కవి పండితులను పోషించడంతో పాటుగా, సంస్థానంలో పండుగలను గొప్ప ఉత్సవాలుగా జరిపించేవాడు. మొత్తానికి ఆత్మకూరు సంస్థాన చరిత్రలో రాజ సీతారాంభూపాల్ చిరస్మరణీయుడు.
▪కోటలో అమ్మవారు:
దసరా వచ్చిందంటే కోటలో అమ్మవారిని ప్రతిష్టించి, తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో ఘనంగా అలంకరించే వారు. ఈ సందర్బంగా నిత్య అన్నదానం జరిగేది. ఆత్మకూరు పురవీధులు పువ్వులతో మామిడితోరణాలతో అలంకరించబడేవి. ఊరంతా సుగంధ పరిమళాలతో నిండి ఉండేది.
▪కళలు ~ సాహిత్య సభలు:
దసరా సందర్బంగా ప్రతి నిత్యం కోలాటాలు, బొడ్డెమ్మలు, ప్రజలకు కనువిందు చేసేవి. ఆటల పోటీలు జరిగేవి. విజేతలకు బహుమానాలు ఇవ్వబడేవి.
పండిత సభలు నిర్వహించబడేవి. పురస్కారాలు ఉండేవి. సత్సంగాలు జరిగేవి.
▪గ్రామాలకు కానుకలు:
ఆత్మకూరు సంబంధిత గ్రామాల్లో ప్రజలకు సంస్థానం తరుపున కానుకలు కూడా పంపించబడేవి. సంస్థానంలో జరిగే దసరా వేడుకలను తిలకించేందుకు గ్రామాల నుండి ప్రజలు ఆత్మకూరు తరలి వచ్చేవారు. అట్లా వచ్చిన ప్రజలకు అసౌకర్యం కలుగకుండా విడిది గృహాలు ఏర్పాటు చేయబడేవి.
▪దుర్గాష్టమి:
దుర్గాష్టమి నాడు ఆయుధ పూజలు ఘనంగా నిర్వహించబడేవి. రాజుల కత్తులు ఈ సందర్బంగా పూజింపబడేవి. ఆత్మకూరు ప్రవేశ మార్గాల్లో పొట్టేళ్లు ఒక్క వేటుకు నరకబడేవి. ఊరికి ఏ దృష్టి సోకవద్దనే నమ్మకంతో రాజావారు ఈ ఆచారాన్ని పాటించేవాడు. రావణకాష్టం సందర్బంగా అశేష జనాలు వెన్నంటి కదలగా.. మేళ తాళాలు, చెక్కభజనలు, కీర్తనలు, గౌరవార్థం కొనసాగుతుండగా.. రాజావారు అంబారీ మీద ఊరేగేవాడు. అలంకరించిన ఏనుగు మీద రాజావారు ఠీవిగా కూర్చుని ప్రజలకు అభివాదం చేసేవాడు. ఈ విధంగా సంస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి

