(By నాళం పద్మశ్రీ)
సీతాఫలం, రామాఫలం.. ఈ పేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లు కాబోలు అనిపించక మానదు. ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లు అనిపిస్తుంది. కానీ, వీటి స్వస్థలం మనదేశం కాదు! దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరువాత వీటికి ఆ పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ, మనందరికీ ఇష్టమైన రాముడు, సీతల పేర్లు పెట్టేసి తమ భక్తి చాటుకున్నారు.
సీతాఫలం తింటే అజీర్తి మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. సీతాఫలాల గుజ్జును జ్యూస్ లా చేసి పటికి బెల్లం లేదా చక్కెర వేసి పాలతో కలిపి ఇస్తే పాలిచ్చే తల్లులకు, ఎదిగే పిల్లలకు మంచి ఆహారం. నరాలు, కండరాలు బలహీనతగలవారికి ఈ పండు మంచి పోషకాహారం. చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
కాలానుగుణంగా ఉత్పత్తి అయ్యే పండ్లలో ఒక్కొక్క పండుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఏ పండు అయినా, శరీరానికి కేలరీలతోపాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందించగలవు, అయితే సీతాఫలం మాత్రం ఇందుకు భిన్నమైనదనక తప్పదు. ఆహార పదార్థంగా ఆకలిని తీర్చడం మాత్రమేగాక, ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు ఇందులో దాగివున్నాయి. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెపుతోంది. దేహపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల ధీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి సీతాఫలానికి ఉంది. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే..
‘‘సీతాఫలాల సీజన్ అయిపోవచ్చింది. మహా అయితే మరో 15 రోజులే ఈ పండ్లు దొరికేది. షుగర్ ఉంది, బెల్లం ఉంది అనేసి దూరం పెట్టకండి. ఎలాగూ టెస్టులు చేయిస్తుంటారు, మందులు మింగుతుంటారు కదా! ఈ వారం-పది రోజులు పండగ చేసుకోండి’’ అని చెబుతున్నారు మిత్రులు, సీనియర్ జర్నలిస్ట్ మణిభూషణ్.

