కొత్తగూడెం: పదిహేను లక్షల రూపాయలు ఇస్తావా? చస్తావా? అంటూ బెదిరించి, కొంత మొత్తాన్ని వసూల్ చేసుకుని, మిగతా మొత్తం కోసం బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్న ఓ పత్రికా విలేకరి బాగోతమిది. పాల్వంచ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
‘సమీక్ష’కు అందిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా అంతంత మాత్రంగానే ‘ప్రింటు’ రూపంలో వెలువడుతున్న ఓ దినపత్రికకు చెందిన పాల్వంచ విలేఖరి ఒకరు పట్టణంలో ఓ వ్యక్తి నిర్మిస్తున్న ఫంక్షన్ హాలుపై గత అక్టోబర్, ప్రస్తుత నవంబర్ నెలల్లో వేర్వేరు తేదీల్లో పలు వార్తా కథనాలు రాశాడు. వార్తా కథనాలు రాయడంతోపాటు ఫంక్షన్ హాలు నిర్మిస్తున్న వ్యక్తి వద్ద పనిచేస్తున్న తాపీ మేస్త్రీని సంప్రదించి, మీ ఓనర్ ను డబ్బులు ఇవ్వాలని చెప్పాల్సిందిగా పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు రాస్తానని, తాను గుండాల అటవీ ప్రాంతానికి చెందినవాడినని, అక్కడివాళ్లను ఉపయోగించి మీ సార్ ను చంపేస్తానని బెదిరించాడు. తాను చెబితే రాత్రికి రాత్రే మీ సార్ ను హతమారుస్తారు.. అనే విషయాన్ని ఫంక్షన్ హాలు ఓనర్ కు తెలియజేయాల్సిందిగా విలేకరి తాపీ మేస్త్రీకి చెబుతాడు. దీంతో విషయాన్ని తాపీ మేస్త్రీ ఫంక్షన్ హాల్ ఓనర్ దృష్టికి తీసుకువెళ్లగా అతను స్పందించలేదు.
ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ హాల్ ఓనర్ సోదరుడిని ఈనెల 3వ తేదీన సంప్రదించి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్ రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తున్నదని, తాను మేనేజ్మెంట్ తో మాట్లాడి రూ. 6.00 లక్షలకు ఒప్పించానని, త్వరగా డబ్బులు చెల్లిస్తే మీ అన్న బతికి బట్ట కడతాడని విలేకరి బెదిరించాడు. ఈ పరిణామాల మధ్య ఫంక్షన్ హాల్ యజమాని సోదరుడు ఈనెల 7వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ఆ పత్రిక విలేకరికి రూ. లక్ష ఇచ్చాడు. మిగిలిన రూ. 5.00 లక్షల మొత్తాన్ని ఈనెల 12వ తేదీలోగా ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని విలేకరి ఈ డబ్బు చెల్లింపు సందర్భంగా కండిషన్ కూడా పెట్టాడు.
అయితే ఈనెల 12వ తేదీ వరకు సమయం ఇచ్చి 10వ తేదీ సోమవారం నుంచే విలేకరి డబ్బు కోసం మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫంక్షన్ హాలు ఓనర్ సోదరునికి ఈనెల 11వ తేదీన ఫోన్ చేసి త్వరగా డబ్బులు మేనేజ్మెంటుకు జమ చేయాలని మళ్లీ ఒత్తిడి చేశాడు. దీంతో అతను ఆ విలేకరిని అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు పాల్వంచ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద గల ఓ షాపు వద్ద కలిసి మాట్టాడారు. తమ వద్ద నగదు లేదని, బ్యాంక్ ఎకౌంట్ కు డబ్బు బదిలీ చేస్తామని చెప్పగా, విలేకరి తన ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా మధ్యాహ్నం 3.33 గంటలకు ఒక ఎకౌంట్ నెంబర్ పంపాడు. అయితే మళ్లీ సాయంత్రం 4.36 గంటలకు వాట్సాప్ కాల్ చేసి ఆ ఎకౌంట్ నెంబర్ కు వద్దు, బదులుగా ఇంకో ఎకౌంట్ నెంబర్ ఇస్తానని చెప్పి సాయంత్రం 6.07 గంటలకు ఎకౌంట్ నెంబర్ పంపించి దానికి నగదు బదిలీ చేయాలని కోరాడు.
ఇలా సాగుతున్న బ్లాక్ మెయిల్ విలేకరి బాగోతంపై ఫంక్షన్ హాల్ యజమాని పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. విలేకరి పాల్పడిన బ్లాక్ మెయిల్ కు సంబంధించిన పక్కా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించనున్న బాధితుని ఫిర్యాదుపై పాల్వంచ పోలీసులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం.

