Top 5 This Week

Related Posts

విజయవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఈవీ కారులో మంటలు.. నలుగురు సజీవదహనం

  • విజయవాడ వెస్ట్ బైపాస్‌పై డివైడర్‌ను ఢీకొన్న కారు..
  • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్‌ రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్‌ (ఈవీ) కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారిని నున్న, నంబూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్‌ (39), ఆయన తల్లి అరుణతో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ, మరో చిన్నారి ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతతో కారు పూర్తిగా దగ్ధమైంది. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Popular Articles