Top 5 This Week

Related Posts

మున్నూరు కాపు కార్పొరేషన్ కు రూ. 5,000 కోట్లు కేటాయించాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

  • మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలి
  • ఖమ్మం మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  • వైభవంగా జిల్లా నూతన కమిటీ, కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ఖమ్మం: తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ కు రాష్ట్ర బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే మున్నూరు కాపు యువత, మహిళ, నిరుపేద రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు.

ఖమ్మంలోని మున్నూరు కాపు హాస్టల్ భవనంలో జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తా సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

మున్నూరు కాపు సంఘంలో తాను మొదటి నుండి ఎన్నికలకు దూరమని, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా మన ఐక్యతను నిరూపించుకోవాలనే ఆలోచనతో పనిచేస్తానని రవిచంద్ర చెప్పారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లోని మున్నూరు కాపు సంఘం నాయకుల సమక్షంలో పార్టీలకతీతంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నామని గుర్తు చేశారు. మున్నూరు కాపు కులంలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

బీసీలలో మున్నూరు కాపుల జనాభా అత్యధికమని గతంలో వి. హనుమంతరావు, డి. శ్రీనివాస్, కేశవరావు, పొన్నాల లక్ష్మయ్య లాంటివారు సీఎం పదవి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా చివరి నిమిషంలో వారికి అవకాశం చేజారిందన్నారు. మున్నూరు కాపులు అన్ని పార్టీలలో ఉండాలని, కానీ సరైన సమయంలో ఐక్యత చూపాలన్నారు. ఇప్పటివరకు తాను మనం కులానికి చాలా తక్కువగా చేశామని ఇంకా ఎంతో చేయాల్సింది ఉందన్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూక్తికి అనుగుణంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మనం ఎదిగే క్రమంలో స్థానికంగా ఉన్న కులంలో మంచి పేరు సంపాదించి సేవ చేయాలన్నారు. మొత్తం 56% ఉన్న బీసీలను కలుపుకొని వెళ్ళినప్పుడు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాష్ట్ర మంత్రివర్గంలో మొదటిసారి మున్నూరు కాపులకు స్థానం దక్కకపోవడం బాధాకరమన్నారు.

ఖమ్మంలో మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ అభివృద్ధికి, సంఘం మాజీ అధ్యక్షులు మేకల సంగయ్య విగ్రహ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. హైదరాబాదులో వివిధ గ్రూప్ లు, సంఘాలుగా ఉన్న సంఘాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ప్రభుత్వం కోట్లది రూపాయల ఐదు ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఇప్పుడు రూ. 150 కోట్ల నిధులతో భవన నిర్మాణానికి పునాదులు పడ్డాయన్నారు.

ముఖ్యంగా జనాభాలో సగం బాగా ఉన్న మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని రాజకీయాలలో రాణించాలని వద్దిరాజు ఉద్భోదించారు. యువత వ్యాపారంలో రాణిస్తూ ఐక్యంగా ఉంటూ కుల సేవ చేయాలన్నారు యువత తలుచుకుంటే సాధించలేనిది లేదన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాల వైపు ముందుకు పోవాలని ఎంపీ రవిచంద్ర కోరారు. అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, జిల్లా మాజీ అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొదిల రవి కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేంద్రం, నాయకులు మడూరు పూర్ణ, మెంతుల శ్రీశైలం, తోట రామారావు, తోట రమేష్, పగడాల మంజుల, తోట సుజలా రాణి, హారిక నాయుడు, పారా ఉదయ్ కుమార్, మేకల శ్రీనివాసరావు, మేకల నాగేందర్, మిర్యాల రామకృష్ణ, లక్కినేని రఘు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, ఆళ్ల కృష్ణ, కనకం జనార్ధన్, మేకల బిక్షమయ్య, పసుపులేటి నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.

Popular Articles