హైదరాబాద్: హైదరాబాద్ బోడుప్పల్ మేడిపల్లి మెయిన్ రోడ్ లో గల టాటా కంపెనీకి చెందిన ‘క్యారట్ లేన్’ డైమండ్ నగల షోరూమ్ లో భారీ చోరీ జరిగింది. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే దొంగల ముఠా రూ. 2.00 కోట్ల విలువైన వజ్రాలను, ఇతర నగలను దోపిడీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నగల షాపు షట్టర్ తాళాలు తొలగించి లోపలికి చొరబడిన దొంగలు గ్లాస్ డోర్లను పగులగొట్టి షో కేసు, డెస్కుల్లోని బంగారం వజ్రాభరణాలను దోచుకువెళ్లారు.

తమ షాపులో రూ.రెండు కోట్ల విలువైన నగలు చోరికి గురైనట్లుగా షోరూమ్ ఫ్రాంచైజ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ను రప్పించి సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించిన తర్వాతే దుండగులు చోరీకి పాల్పడి ఉండవచ్చని, పరిసరాల వాతావరణాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించుకుని మరీ దొంగలు చోరికి పాల్పడి ఉంటారనే అనుమానాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

దోపిడీకి పాల్పడింది రాజస్థాన్ ముఠాగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏడుగురు దొంగలు చోరీ ఘటనలో పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒక్కడే లోపలికి వెళ్ళి నగల బ్యాగుతో బయటకు వచ్చినట్లు గుర్తించారు. అలారం మోగుతుందనే అవగాహనతోనే దొంగలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కాగా ఈ దొంగతనంలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు డీసీపీ సురేష్ చెప్పారు. షోరూమ్‌లోకి ఒకడు మాత్రమే ప్రవేశించగా, మిగిలిన దుండగులు బయట వేచి ఉన్నారని తెలిపారు. ఘటనలో సుమారు రూ. 2.00 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని, మొత్తం ఐదు నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగిందని చెప్పారు. ఐదు నిమిషాల తర్వాత తలుపు మళ్లీ తెరిస్తే అలారం మోగుతుందనే విషయం తెలిసి దొంగలు జాగ్రత్తగా వ్యవహరించారని, రాజస్థాన్‌కు చెందిన ముఠా ప్రమేయం ఉండవచ్చని అనుమానం ఉందని డీసీపీ పేర్కొన్నారు.

