Top 5 This Week

Related Posts

నాకేం సంబంధం..!?: బిడ్డ సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ రియాక్షన్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈమేరకు తనకు పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మెన్ మల్లు రవి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మంత్రి సురేఖ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.

ఈనెల 19వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు చేసుకున్నారని, సేవా కార్యక్రమాలు చేపట్టారని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగానే తన స్వస్థలమైన గీసుగొండతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో అక్కడి అభిమానులు, కార్యకర్తలు నిర్వహించిన తన బర్త్ డే వేడుకల్లో తన కూతురు కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నట్లు మంత్రి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె స్వంత అభిప్రాయాలకు సంబంధించినవిగా మంత్రి ఉటంకించారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, వివరణ కోరడం తగదన్నారు. దీనికి తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వినమ్రంగా తెలియజేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తన వివరణ లేఖలో తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, కాబట్టి వాస్తవాలను, ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని, సుస్మిత వ్యాఖ్యల విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించాలన్నారు. తద్వారా తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా కోరుతున్నట్లు మంత్రి సురేఖ పేర్కొన్నారు.

Popular Articles