Top 5 This Week

Related Posts

కశ్మీర్ లోకి 10,000 మంది టెర్రరిస్టులు..!? పాకిస్థానీ మతగురువు వ్యాఖ్యల కలకలం

(‘సమీక్ష’ న్యూస్ డెస్క్)
జమ్మూ కశ్మీర్ లోకి ఒకరిద్దరు కాదు.. 10,000 మంది టెర్రరిస్టులు చొరబడ్డారా..!? పాకిస్థానీ మత గురువు నసీర్ మద్నీ ఓ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈనెల ప్రారంభంలో ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తుండగా, నసీర్ మద్నీ గుండెపోటుకు గురైనట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో అతను తిరిగి బహిరంగ వేదికపైకి రావడం గమనార్హం. ఈనెల 14వ తేదీన వహావల్ నగర్ లో నిషేధిత టెర్రరిస్టు సంస్థతో బంధం గల ఓ సబలో నసీర్ మద్నీ ప్రసంగిస్తూ, లష్కర్-ఎ-తైబా (LeT) వ్యవస్థాపకుడు హాఫీజ్ సయీద్ గురించి ప్రస్తావించడంతోపాటు, సయీద్ 10,000 మంది ఉగ్రవాదులను కాశ్మీర్‌కు పంపారని పేర్కొన్నారు. నసీర్ మద్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అయితే నసీర్ మద్నీ చేసిన ఈ వ్యాఖ్యలు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో LeT ప్రమేయం ఎంతమేరకు ఉందనే అంశంపైనేగాక, దాని వ్యవస్థాపకుడు పోషించినట్లు ఆరోపించబడుతున్న పాత్రపై మళ్లీ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. భారత్ లో ఉగ్రవాద కేసులలో హాఫీజ్ సయీద్ ఇప్పటికే కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్ లో అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ ‘లష్కర్-ఎ-తైబా’కు సయీద్ వ్యవస్థాపకుడు.

అల్-ఖైదా, తాలిబన్‌ల టెర్రరిస్టు సంస్థలో సంబంధాలు ఉండడంతో LeTపై ఐక్యరాజ్యసమితి 2005లో ఆంక్షలను విధించింది. ఆ తర్వాత సయీద్ ను అమెరికా 2008లో ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అదేవిధంగా 26/11 ముంబై దాడులు సహా భారతదేశంలో జరిగిన ప్రధాన ఉగ్రవాద దాడుల దర్యాప్తులో కూడా సయాత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇంతకుముందు జూలైలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో జమ్మూ కోర్టు సయీద్‌పై నాన్ బెయిలబుట్ వారెంట్‌ను జారీ చేసింది.

ఈ కేసులో పరారీలో గల ఆరుగురు పాకిస్థానీ నిందితులకు వ్యతిరేకంగా ‘గైర్హాజరీలో విచారణ’ (in absentia trial) ప్రక్రియను ముంబై పోలీసులు అధికారికంగా ప్రారంభించారు. 2008 నవంబర్ 26 రాత్రి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించడంతో 26/11 దాడులు మొదలయ్యాయి. తర్వాతి నాలుగు రోజుల్లో నగరం అంతటా టెర్రరిస్టులు సమన్వయంతో దాడులు జరిపి, 166 మందిని పొట్టనబెట్టుకోవడంతోపాటు సుమారు 300 మందిని గాయపరిచారు.

ఈ దాడి ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ప్రముఖ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ముంబయిలో జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. ‘గైర్హాజరీలో విచారణ’ ప్రక్రియలో నిందితులు దోషులుగా తేలితే కోర్టులో వారికి శిక్ష ఖరారవుతుంది. ఆ తర్వాత దోషులుగా తేలినవారిని భారతదేశానికి తీసుకువస్తే ఆ శిక్ష అమలవుతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తులో కూడా సయీద్ పేరు వెలుగులోకి వచ్చింది. నిరుడు ఏప్రిల్ లో జరిగిన పహల్గామ్‌ దాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే.

Popular Articles