Top 5 This Week

Related Posts

రూ. 108 కోట్ల కెనాల్ పనుల్లో ‘డొల్లతనం’పై కిమ్మనని ‘కీలక’ నేతలు

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానమైన రాజీవ్ లింక్ కెనాల్ పనుల్లో బహిర్గతమైన నాణ్యత డొల్లతనంపై అధికార పార్టీ నాయకులెవరూ కిమ్మనడం లేదు. ఈ లింక్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసే అంశంలో ‘క్రెడిట్’ కోసం పరితపించిన ఒకరిద్దరు కీలక నాయకులు కూడా కాల్వలో నెలకొన్న తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది నెలల క్రితం రాజీవ్ లింక్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన అంశంలో పాలక పార్టీకి చెందిన కీలక నాయకులు ఎంతగా పరితపించారనేది బహిరంగమే. ఆ నాయకుల తపన రైతు సంక్షేమం కోసమే కావచ్చు.. కానీ రైతు ప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా నిర్మించిన కాల్వలోని ప్రస్తుత దుస్థితిని ఆయా నాయకులు కనీసం కంటితో పరిశీలించడానికి కూడా సిద్ధపడకపోవడంపైనే ప్రజల్లో భిన్న చర్చ జరుగుతోంది.

ఏమిటీ కాల్వ..?
సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు మళ్లించేందుకు నిర్దేశించి, నిర్మించిన కాల్వ ఇది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, ఖమ్మం జిల్లా ఏన్కూరు రాజీవ్ లింక్ కెనాల్ పేరుతో దీన్ని నిర్మించారు. దాదాపు తొమ్మిది కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ కెనాల్ పనుల విలువ రూ. 108 కోట్లుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ‘సమీక్ష’కు చెప్పారు. ఇందులో భూసేకరణకు సుమారు 32.00 కోట్ల మొత్తాన్ని మినహాయిస్తే, కాల్వ నిర్మాణానికి దాదాపు రూ. 76 కోట్లు వ్యయం చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఏడాాది గడువు.. నాలుగు నెలల్లోనే పూర్తి:
సీఈ శ్రీనివాసరెడ్డి చెప్పిన ప్రకారమే రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులను దక్కించుకున్న ఖమ్మానికి చెందిన ఎంఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ సంస్థకు ఏడాది గడువును విధించారు. అయితే దాదాపు నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేసినట్లు సీఈ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అత్యంగా వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. స్పీడ్ గా పనులు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా ఆయన అంగీకరించారు.

కాంట్రాక్టర్ గొప్పోడే.. కానీ కాల్వ సీసీ లైనింగ్ ఎట్ల ధ్వంసమైందో!?
కాల్వ పనులను నిర్వహించిన ఖమ్మానికి చెందిన ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సాదా సీదా నిర్మాణ సంస్థేమీ కాదు. ఈ సంస్థ నిర్వాహకుడు, మేనేజింగ్ పార్టనర్ అయినటువంటి మొగిలి శ్రీనివాసరెడ్డి స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ స్థాయిని కలిగి ఉండడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటై 150 ప్రాజెక్టుల వరకు పూర్తి చేసినట్లు ఆ సంస్థ తన వెబ్ సైట్లో పేర్కొంది. రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో పనిచేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సవాల్ తో కూడిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రసిద్ధి చెందినట్లు కూడా ఆ సంస్థ చెప్పుకుంది.

అయితే ఇంతటి గొప్ప నేపథ్యంగల ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్దేశించిన గడువుకన్నా ఎనిమిది నెలల ముందుగానే నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ వరుసగా పగుళ్ల పాలవుతున్న తీరు నిర్మాణంలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందనే వ్యాఖ్యలు రైతు వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మొన్న ఏన్కూరు వద్ద సీసీ లైనింగ్ ధ్వంసం కాగా, తాజాగా జూలూరుపాడు వద్ద ఇదే తరహాలో మరింత తీవ్ర స్థాయిలో కాల్వ పనులకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూసేకరణలో తాము అనేక సమస్యలు ఎదుర్కున్నామని, వేగంగా నిర్మించం వల్ల సమస్యలు ఉత్పన్నయ్యే అవకాశాలు లేకపోలేదని సీఈ శ్రీనివాసరెడ్డి పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.

కాంట్రాక్టర్ సేఫ్..!
పది కాలాలపాటు రైతులకు సాగునీరు అందించాల్సిన ఈ కాల్వలో నిర్మించిన సీసీ లైనింగ్ స్వల్ప వ్యవధిలోనే నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న తీరు పనుల ‘నాణ్యత’ను ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ఈ కాల్వలో ఒకటి, రెండుసార్లు మాత్రమే నీటిని వదలడం ఈ సందర్భంగా గమనార్హం. దీంతో కనీసం పాతకేళ్లపాటు మన్నికగా ఉండాల్సిన కాల్వ ‘నాణ్యత’పై సహజమైన అనుమానాలే రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ కాల్వ పనులను నిర్వహించిన ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు తొంభై శాతానికి పైగా బిల్లులు చెల్లింపులు జరిగాయని ఇరిగేషన్ విభాగపు కొత్తగూడెం సీఈ శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా ఉందని, ఈఎండీలు వగైరా కలిపి దాదాపు రూ. 10.00 కోట్ల వరకు ఇంకా తమ వద్ద ఫైనల్ బిల్లు పెండింగ్ లో ఉందని ఆయన చెప్పారు.

‘నాణ్యత’ను తనిఖీ చేయకుండా నెపాన్ని రైతులపై నెడతారా..?
రాజీవ్ లింక్ కెనాల్ పనుల్లో బహిర్గమవుతున్న నాణ్యత డొల్లతనంపై ఇరిగేషన్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు చెబుతున్న వాదన భిన్నంగా ఉండడం విశేషం. సామర్థ్యానికి మించి మోటార్ నీటిని పంపింగ్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఈ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. కేవలం 1,400 క్యూసెక్కుల నీటి ప్రవాహపు సామర్ధ్యం గల కాల్వలో 1,700 క్యూసెక్కుల నీటి విడుదల వల్ల ఒత్తిడి పెరిగి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ కొట్టుకుపోయిందనేది ఆయన వాదన.

ఇదే దశలో స్పీడ్ గా పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయని, క్యూరింగ్ తదితర అంశాలు సరిగ్గా జరగకపోవచ్చని కూడా ఆయనే చెబుతున్నారు. మరోవైపు జూలూరుపాడు వద్ద చోటు చేసుకున్న పగుళ్లకు ఒకరిద్దరు రైతులే కారణమని కూడా ఇరిగేషన్ అధికారులు చెబుతుండడం గమనార్హం. పొలాల్లో నిలిచిన నీటి బయటకు పంపేందుకు కొందరు రైతులు చేసిన చర్య వల్ల ఏన్కూరు వద్ద లైనింగ్ కొట్టుకుపోయిన ఘటన జరిగిందని, జూలూరుపాడు వద్ద గుట్టల్లో రాళ్లు తీసుకుపోవడానికి వచ్చినవారి వల్ల సమస్య వచ్చిందని డీఈ చంద్రశేఖర్ చెబుతుండడం ఆసక్తికరం.

క్వాలిటీ సెల్ ఏం చేస్తున్నట్లు..?
మొత్తంగా పనుల్లో నాణ్యతను చెక్ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏం చేస్తోందనే ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. పనుల నాణ్యతను పరిశీలించి ‘సర్టిఫికెట్’ ఇవ్వాల్సిన క్వాలిటీ సెల్ తన బాధ్యతను సక్రమంగానే నిర్వహిస్తోందా? అనే ప్రశ్నలూ రేకెత్తుతున్నాయి. మరోవైపు అటు ఏన్కూరు వద్ద, ఇటు జూలూరుపాడు వినోభానగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్ సీసీ లైనింగ్ పనుల తీరుపై అధికార పార్టీ నేతలు కిమ్మనకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Popular Articles