‘నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాస్పేట గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన సుమారు 1,000 ఎకరాల భూమి విషయంలో జరిగిన భారీ భూ కుంభకోణం గురించి మీ దృష్టికి తీసుకువస్తూ, ఆ రైతులకు సంబంధించిన విన్నపాన్ని దీనితో పాటు జతచేసి పంపుతున్నాను. ఈ కుంభకోణంలో భూ మాఫియా, అధికార ప్రభుత్వానికి చెందిన రాజకీయ నాయకులు అక్రమ భూ లావాదేవీల ద్వారా ప్రమేయం కలిగి ఉన్నారని కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
దయచేసి ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యల నివేదికను నాకు అందజేయాలని కోరుతున్నాను.
ధన్యవాదాలతో,
(సంతకం)
గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు.. సరిగ్గా 37 నెలల క్రితం.. 2023 జూలై 15వ తేదీన మల్కాజిగిరి ఎంపీ హోదాలో ప్రస్తుత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు రాసిన లేఖ ఇది. ఇందులో తాజా విశేషం ఏమిటనుకుంటున్నారా..? అదే అసలు పాయింట్.

బొమ్మరాస్ పేటలోని సుమారు 1,049 ఎకరాల భూ కుంభకోణం, అక్రమ భూమార్పిడి అనే ఆరోపణలపై తాజాగానూ రైతులు ఉద్యమిస్తున్నారు. దశాబ్ధాలుగా తమ ఆధీనంలోగల ఆయా విస్తీర్ణపు భూములకు రాత్రికి రాత్రే నకిలీ పత్రాలు, రికార్డులు సృష్టించి యాజమాన్య హక్కులను మార్చేశారనేది రైతులు ఆరోపిస్తున్న ముఖ్యాంశం. అత్యంత విలువైన ఈ భూములు 22-A కింద నిషేధిత జాబితాలో లేకపోయినా, అధికారులు పరోక్షంగా లావాదేవీలను నిలిపేశారని కూడా రైతులు చెబుతున్నారు.

అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడు ఇక్కడి వందలాది ఎకరాల భూమిని కొల్లగొట్టడానికి కుట్ర పన్నారని, అందువల్లే రెవెన్యూ అధికారులు తమకు సహకరించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో రైతులు శామీర్ పేట్ తహశీల్దార్ ఆఫీసు ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది.
అయితే మల్కాజిగిరి ఎంపీ హోదాలో అప్పట్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై ఆరోపణలు చేస్తూ, కలెక్టర్ కు లేఖ రాసి రైతులకు మద్ధతుగా నిలవడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదే దశలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత అధికార పార్టీ లీడర్లపై ఆరోపణలు చేస్తూ రైతుల ఆందోళనకు మద్ధతు తెలుపుతుండడం ఆసక్తికరం.
ఈ నేపథ్యంలో అప్పుడు ఎంపీ హోదాలో రైతులకు న్యాయం చేయాలని అభిలషిస్తూ కలెక్టర్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నారు. అందువల్ల బొమ్మరాస్ పేట రైతులకు 1,000 ఎకరాల అంశంలో న్యాయం చేయడం ఆయనకు పెద్ద సమస్యే కాదనేది రాజకీయ పరిశీలకుల వాదన. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి మరి..!

