ఖమ్మం: ఇసుక అక్రమ రవాణాపై ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ పోలీసులకు ఏసీపీ తిరుపతిరెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ నుంచి మన రాష్ట్రం వైపు ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సబ్ డివిజన్ లోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లకు నిర్దేశించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని రాష్ట్ర సరిహద్దులో గల మల్కాపురం క్రాస్ రోడ్డు గల చెక్ పోస్ట్ ను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన పోలీసులకు దిశా, నిర్దేశం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అక్రమంగా తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణాకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో చెక్ పోస్టుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఖమ్మం రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులలో పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని ఏసీపీ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంట ముదిగొడ సీఐ మురళి కూడా ఉన్నారు.

