హైదరాబాద్: పాలకులు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణ కేసులను భరించాల్సిన పరిస్థితులపై, మంచి పేరు సంపాదించుకున్న ఐఏఎస్ అధికారుల గురించి, రైతు బంధు, ఫీజు రీయింబర్స్మెంట్, పనికి ఆహర పథకం, ఉచిత పథకాలపై జస్టిస్ నగేష్ భీమపాక అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన స్టాంప్ డ్యూటీ సర్ ఛార్జి బకాయిలు రూ. 33.00 కోట్ల చెల్లింపు అంశంలో కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటంటే..
- అధికారులను హైకోర్టుకు పిలిపించడం మాకూ బాధగానే ఉంది.
- ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నపుడు సందీప్ కుమార్ పై అనేక కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి.
- సందీప్ కుమార్ పై మూడు, నాలుగు వేల ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి.
- వీటిపై శిక్ష విధించమంటూ జరిగితే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది.
- ప్రభుత్వ తప్పుల వల్లే అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కుంటున్నారు.
- సందీప్ కుమార్ సుల్తానియా మంచి అధికారే, కానీ తప్పని పరిస్థితుల్లో ఆదేశాలు ఇస్తున్నాం.
- ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారు.
- రైతుబంధు పథకంలో ఎంతోమంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారు.
- దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది కదా..?
- ఎవరికైనా సమాజంలో బాధ్యత ఉందా..?
- ఉచిత పథకాల ద్వారా భవిష్యత్ తరాలను ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి?
- ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చాం అనుకునేవాళ్లం..
- కానీ ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చిందనే పరిస్థితికి వచ్చాం.
- ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. మనకేమిచ్చారు? నాకేమిచ్చారు? అనే స్థికి వచ్చాం.
- గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటివారిని చూసి ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలనుకునే వాళ్ళు.
- కానీ ఇప్పుడు ఈ దేశం నాకేమిచ్చిందని అనుకుంటున్నాం.
- మేం రాజకీయ ఉపన్యాసాలు చేయాలనుకోవడం లేదు.
- పౌరుడిగా చెబుతున్న ఆవేదన మాటలు.
- పల్లెటూర్లలో ప్రస్తుతం పని చేయడానికి కూలీలు దొరకడం లేదు.
- రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఒకప్పుడు మనుషులు పనిచేసేవాళ్లంట.. అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి.. దీంతో నేనెందుకు పని చేయాలనే అభిప్రాయానికి వచ్చారు.
- రాజకీయపరమైన ఉపన్యాసం, ప్రభుత్వాలను విమర్శించడం కోసం మేం ఈ వ్యాఖ్యలు చేయడం లేదు.
- ప్రభుత్వాలు ఆలోచించాలని ఉద్దేశంతోనే ఈ మాటలు చెబుతున్నాం.
- ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలను కూడా కొందరు విద్యార్థులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
- కాలేజికి వెళ్లకుండా బయట తిరిగుతున్నారు.
- చదువుకున్నోడికి కాలేజ్ ఫీజులు చెల్లించాలి, కాలేజ్ మానేసిన విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించడం సరైనదేనా?
- బాగా చదువుకొనే వారికి ఫీజులు కట్టండి.. అర్హులైన వారికి పథకాలు ఇవ్వండి.
- కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే ఈ దేశాన్ని ఏమి నడుపుతారు?
- ఇలాగే ఉచిత పథకాలు ఇస్తూ పోతే.. కుబేరునికి కూడా డబ్బులన్నీ అయిపోయి పనికి ఆహారపథకం కింద కుబేరుడు కూలీకి వస్తాడు.
- ఇవన్నీ విమర్శలు కాదు, ఆవేదనతో , భవిష్యత్ అవసరాలు దృష్ట్యా చెపుతున్నాం.
- డేంజర్ బెల్స్ మొగుతున్నాయి, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు.
- సమాజం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పడబోతోంది.

