Top 5 This Week

Related Posts

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కు పదేళ్ల జైలు శిక్ష: ఏమిటీ లైంగిక దాడి కేసు!?

అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 10.00 లక్షల జరిమానా విధిస్తూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. తన సహోద్యోగిపై అత్యాచారం కేసులో తరుణ్ తేజ్‌పాల్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. తరుణ్ తేజ్ పాల్ నాలుగు వారాల్లో లొంగిపోవాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో తరుణ్ తేజ్ పాల్ ను ట్రయల్ కోర్టు 2021లో నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. దాదాపు పదమూడేళ్ల క్రితం.. 2013 నాటి లైంగిక దాడి కేసులో ‘తెహల్కా’ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్ లతో కూడిన గోవా ధర్మాసనం గత వారమే తీర్పును రిజర్వ్ చేసింది.

ఏమిటీ కేసు వివరాలు?
గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నవంబర్ లో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా లిఫ్ట్‌లో తన మాజీ జూనియర్ సహోద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేజ్‌పాల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన దోషిగా తేలారు.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను నిరంతరం ఖండిస్తూ వచ్చిన తేజ్‌పాల్‌ను 2013 నవంబర్ 30న అరెస్టు పోలీసులు చేశారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో ఆయన ‘తెహల్కా’ ఎడిటర్-ఇన్-చీఫ్ పోస్టుకు రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది.

తరుణ్ తేజ్ పాల్ (ఫైల్ ఫొటో)

పూర్వపు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్లు 341 (అక్రమంగా అడ్డుకోవడం), 342 (అక్రమ నిర్బంధం), 354 (మహిళా గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి లేదా నేరపూరిత బలం ప్రయోగించడం), 354-A (లైంగిక వేధింపులు), 354-B (దుస్తులు తొలగించే ఉద్దేశంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలం ప్రయోగించడం), 376(2)(f) (అధికార హోదాలో అత్యాచారానికి పాల్పడటం), 376(2)(k) (నియంత్రణ లేదా అధికార హోదాలో ఉండి అత్యాచారం చేయడం) సెక్షన్ల కింద తరుణ్ తేజ్ పాల్ విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఆయనకు జూలై 2014లో బెయిల్ లభించింది.

అక్రమ నిర్బంధం, మహిళా గౌరవానికి భంగం కలిగించేలా దాడి, లైంగిక వేధింపులు, సహోద్యోగిపై అత్యాచారం వంటి తనపై మోపిన ఆయా ఆరోపణల నుండి గోవాలోని ట్రయల్ కోర్టు 2021 మేలో ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత గోవా ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేసింది.

అప్పట్లో నిర్దోషిగా విడుదలైన సమయంలో.. ‘కఠినమైన, నిష్పక్షపాతమైన, న్యాయమైన విచారణ” జరిపినందుకు తరుణ్ తేజ్ పాల్ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై చేసిన “తప్పుడు ఆరోపణల విపత్కర పరిణామాలను” ఎదుర్కోవడంలో గత ఏడున్నర సంవత్సరాలు తన కుటుంబానికి తీవ్ర మానసిక క్షోభను కలిగించాయని ఆయన పేర్కొన్నారు.

వాద, ప్రతివాదనల అనంతరం ఈకేసులో తరుణ్ తేజ్ పాల్ ను బాంబే హైకోర్టు దోషిగా తేల్చింది. అంతకు ముందు తరున్ తేజ్ పాల్ కోర్టును అభ్యర్థిస్తూ, ‘ఈకేసులో తానే బాధితుడినని, తనకు భార్య ఉందని, ఇంతకు మించి తాను చెప్పడానికేమీ లేదని అన్నారు. తాను అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉందని, దయచేసి తనపై కనిరం చూపాలని, వాస్తవాలన్నీ రికార్డు చేసే ఉన్నాయని వేడుకున్నాడు. అయితే తరుణ్ తేజ్ పాల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Popular Articles