Top 5 This Week

Related Posts

సైబర్ నేరాల కేసులో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ‘పట్టాభి’ అరెస్ట్

హైదరాబాద్: అస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాల ద్వారా భారీ మొత్తపు దోపిడీకి పాల్పడినట్లు నమోదైన కేసులో దేవరపల్లి పట్టాభి అనే కీలక నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన పట్టాభి ఇదే జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరునిగా ప్రాచుర్యం పొందాడు. గడచిన ఏడెనిమిది నెలలుగా పోలీసుల కళ్లుగప్పి విదేశాల్లో తల దాచుకున్నట్లు వ్యాప్తిలోకి వచ్చిన పట్టాభి హైదరాబాద్ లో అడుగిడగానే మాదాపూర్ సైబర్ క్రైం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్ కు తలరించారు.

దేవరపల్లి పట్టాభి తన టీంతో కలిసి చేసిన సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీసులు గత నవంబర్ 28వ తేదీన ఎఫ్ఐఆర్ 2934/2025 ద్వారా ఐటీఏ చట్టం-2000-2008లోని 79, 189, 204, 308, 318(4), 319(2), 336(3), 338, 340(2), 352, r/w 3(5) BNS, 66-C, 66-D, r/w 43 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బెంజ్ కారులో వెడుతున్న పట్టాభిని అరెస్ట్ చేసిన సందర్భంలో అతని వాహనాన్ని నిలిపిన సైబర్ క్రైం పోలీసు

ఈ కేసులో ప్రవీణ్, ప్రకాష్ అనే ఇద్దరు సోదరులతోపాటు కోల్ కతా, ఖమ్మం ప్రాంతాలకు చెందిన మరో తొమ్మిది మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. హైటెక్ సిటీలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రిట్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో 2024లో ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఖమ్మం, కోల్ కతా ప్రాంతాలకు చెందిన పలువురిని ఈ సంస్థలో టెలీ కాలర్లుగా నియమించుకుని సైబర్ నేరాల ద్వారా భారీ దోపిడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్ గా ఎంచుకుని రూ. 100 కోట్ల వరకు దేవరపల్లి పట్టాభి తన నెట్ వర్క్ ద్వారా దోపిడీ చేశారనేది పోలీసుల అభియోగం. కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు.

Popular Articles