Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ అగ్ర నేత మిసిర్ బెస్రా అరెస్ట్.. ఇక మిగిలింది గణపతి!

రాంచీ: మావోయిస్ట్ పార్టీకి చివరి దెబ్బ తగిలిందనే చెప్పాలి. గత మార్చి నెలాఖరును టార్గెట్ గా ఎంచుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆపరేషన్ కగార్ ఫలితంగా ఆ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు సహా వందలాది మంది నక్సల్స్ లొంగిపోవడం, భారీ సంఖ్యలో ఇంకొందరు ఎన్కౌంటర్ కు గురైన సంగతి తెలిసిందే. మావోయిస్ట్ పార్టీ కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సైతం లొంగిపోయిన విషయమూ విదితమే.

ఈ పరిణామాల్లోనే ఆ పార్టీలో మిగిలిన మరో కీలక నేత మిసిర్ బెస్రాను జార్ఖండ్ పోలీసులు ధన్ బాద్ లో అరెస్ట్ చేశారు. గిరిడిహ్‌లోని హర్లాడిహ్‌కు చెందిన మిసిర్ బెస్రా పలు రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక, విధ్వంసక ఘటనల్లో నిందితునిగా ఉన్నారు. మిసిర్ బెస్రాతోపాటు మొచ్చు, సౌరభ్ అనే మరో ఇద్దరు నక్సల్స్ ను, ఇంకో ఇద్దరు గ్రామస్తులను కూడా భద్రతా బలగలు అరెస్ట్ చేశాయి. జార్ఖండ్, బీహార్, ఒడిషా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడంలో మిసిర్ బెస్రా కీలక పాత్రను పోషించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా బలగాల ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో మిసిర్ బెస్రా ఉన్నారు.

మిసిర్ బెస్రా అరెస్ట్ తో జార్ఖండ్ లో మావోయిస్ట్ కార్యకలాపాకలు గట్టి దెబ్బగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. బెస్రాపై వివిధ రాష్ట్రాల్లో రూ. 2.00 కోట్ల నగదు రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు ముందు జార్ఖండ్ లో 16 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో సంతోష్ మహతో అలియాస్ వాసు దా కూడా ఉన్నారు.

ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి (ఫైల్ ఫొటో)

మావోయిస్ట్ పార్టీలో మిగిలిన చివరి పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రాగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిన ఆ పార్టీ సుప్రీం ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గణపతి జాడను కూడా పోలీసులు కనుగొంటే మావోయిస్ట్ పార్టీలో ముఖ్యనేతలందరి ఉద్యమ ప్రస్థానం ముగిసినట్లుగానే విప్లవ కార్యకలాపాల పరిశీలకులు భావిస్తున్నారు.

Popular Articles