ఢిల్లీ: హైడ్రా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ టూల్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. హైడ్రాను తొమ్మిది తలల విషసర్పంగా హైకోర్టు చెప్పిందని, ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో గల కేటీఆర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావులతో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘బడాబాబులను వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి.. రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉంటది. దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగులన్నీ చెరువుల్లో, శిఖాల్లో ఉన్నా వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ‘కబ్జాకోరులని ముఖ్యమంత్రి అంటున్నరు. అందరికంటే పెద్ద కబ్జాకోరులే మీ అన్నాదమ్ములు కదా..? అందరికంటే ఎక్కువ ఆస్తి దోస్తున్నది.. అందరికంటే ఎక్కువ విధ్వంసం చేస్తున్నది మీ మంత్రులు కాదా? కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రులు కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘హైడ్రా పేరుతో నువ్వు సృష్టిస్తున్న అరాచకం కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్‌లో కూలగొట్టి ఒక ఇటుక పెట్టకుండా, ఇల్లు కట్టకుండా విధ్వంసం సృష్టించి రియల్ ఎస్టేట్‌ను సృష్టించి నువ్వు డబ్బులు సొమ్ము చేసుకుంటున్నవ్. పెద్ద పెద్ద బిల్డర్లు ఇవాళ చెరువుల్లో ఇండ్లు, బిల్డింగులు కడుతుంటే నీకు కనబడదు. కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవ్. అందుకే మేమనేది హైడ్రా అనేది బ్లాక్‌మెయిలింగ్ ఎక్స్‌టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

