Top 5 This Week

Related Posts

రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు, భారీగా ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్: తెలంగాణా రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మంచి ఆస్తులు పోగేశారనే అభియోగాలతో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. మొత్తం ఎనిమిది టీంలుగా హైదరాబాద్ తదితర 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం, అక్రమాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది..

దాదాపు ఏడేళ్ల క్రితం.. 2019లో రూ. 26 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ముత్యం వెంకటరమణపై ఏసీబీ మరోసారి దాడులు నిర్వహిస్తోంది. ఈ ఘటన నుంచే ముత్యం వెంకటరమణ కార్యకలాపాలపై ఏసీబీ నిఘా ఉంచినట్లు సమాచారం. ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు అతని బంధువులు, స్నేహితులు, అనుబంధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

రెడ్కో డీఈ నివాసంలో ఏసీబీ అధికారులు గుర్తించిన మద్యం సీసాలు

ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో ముత్యం భార్య స్వప్న పేరుతో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఆంజనేయనగర్, మూసాపేట ప్రాంతాల్లో 10 ఫ్లాట్ల నిర్మాణాలను ఏసీబీ గుర్తించింది. ఇవే ప్రాంతాల్లో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాల గుర్తించినట్లు తెలుస్తోంది. ఖానామెట్, గుట్టల బేగంపేట్‌లో G+5 కమర్షియల్ భవనం వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు కార్లు ఉన్నట్లు కూడా గుర్తించారు.

అంతేగాక విదేశీ మద్యం బాటిళ్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అంచనా వేస్తున్నారు. వెంకటరమణ ప్రస్తుతం రెడ్‌కోలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో పలు ప్రాంతాల్లో పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముత్యం వెంకటరమణ అక్రమాస్తులపై లోతైన విచారణ సాగుతోంది. మొత్తం ఆస్తుల విలువను ఏసీబీ లెక్కలు కడుతోంది. సోదాల అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికార వర్గాలు చెప్పాయి.

Popular Articles