Top 5 This Week

Related Posts

ఏపీలో కరోనా కేసుల కలకలం!


కోవిడ్‌పై అంతా ఆద‌ర‌మ‌ర‌స్తున్న వేళ.. మ‌ళ్లీ నేనున్నానంటూ ఉనికిని చాటుకుంటోంది. ఇటీవ‌ల వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో కోవిడ్ తో ఇద్ద‌రు చ‌నిపోయిన ఘ‌ట‌న‌తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఇంకా అక్క‌డ మ‌రో ఎనిమిది మందికి కోవిడ్ సోకిన‌ట్టు వైద్యారోగ్య శాఖ నిర్ధారించింది. నాలుగేళ్ల త‌ర్వాత రాష్ట్రంలో కోవిడ్ మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంపై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇంత‌లో విశాఖ‌ప‌ట్నంలోనూ కోవిడ్ కేసు వెలుగు చూడ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో ఈ సీజ‌న్ లో ఉత్త‌రాంధ్రలో ఇదే తొలి కోవిడ్ కేసుగా న‌మోదైంది.

హైదరాబాద్ వెళ్లి వచ్చిన యువ‌కుడికి కోవిడ్‌:
వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో కోవిడ్ కేసులు న‌మోద‌వ‌డం, ఇద్ద‌రు చ‌నిపోవ‌డం గురించి విశాఖ వాసులు తెలుసుకున్నా ఏమంత ఆందోళ‌న చెంద‌లేదు. అక్క‌డెక్క‌డో విశాఖ‌కు 750 కిలోమీట‌ర్ల ఆవ‌ల కోవిడ్ సోకితే ఇక్క‌డ ప్ర‌భావం చూప‌దులే.. అనే ధీమాతో ఉన్నారు. అలాంటిది ఉన్న‌ట్టుండి అనూహ్యంగా ఇప్పుడు విశాఖ‌లో క‌రోనా కేసు న‌మోదు కావ‌డంతో అల‌జ‌డి రేగుతోంది. విశాఖ న‌గ‌రంలోని వ‌న్‌టౌన్ అఫిషియ‌ల్ కాల‌నీలో 33 ఏళ్ల యువ‌కుడికి కోవిడ్‌-19 నిర్థార‌ణ అయింది. హైద‌రాబాద్ వెళ్లి ఇటీవ‌ల విశాఖ వ‌చ్చిన ఈయ‌న జ్వ‌రం, జ‌లుబు, ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డ్డాడు. దీంతో ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరిన అత‌నికి తొలుత ప్రైవేటు ల్యాబ్‌లోను, త‌ర్వాత కేజీహెచ్ వైరాల‌జీ ల్యాబ్‌లోనూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ రెండు చోట్ల కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అదే స‌మ‌యంలో పూణేలోని వైరాల‌జీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్‌ కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలిన‌ట్టు బుధ‌వారం అర్థ‌రాత్రి విశాఖ వైద్యారోగ్య శాఖ అధికారుల‌కు నివేదిక వ‌చ్చింది.

నిల‌క‌డ‌గా కోవిడ్ రోగి ఆరోగ్యం:
విశాఖ‌లో కోవిడ్ సోకిన రోగి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆ యువ‌కుడికి కోవిడ్ నిర్థార‌ణ కావ‌డంతో అధికారులు అత‌డిని ఇంటికే ప‌రిమితం చేసి ఐసోలేష‌న్‌లో (హోం క్వారంటైన్‌లో) ఉంచారు. ఆ ఇంట్లోనే కోవిడ్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆ ప‌రిస‌రాల్లో ఉంటున్న వారికీ కోవిడ్ ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. కోవిడ్ రోగి ప‌రిస్థితి మెరుగ్గా ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, విశాఖ‌లో తీవ్ర‌త లేద‌ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జ‌గ‌దీశ్వ‌ర‌రావు చెప్పారు.

విశాఖ‌ ‘విమ్స్‌’లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేష‌న్ వార్డు

విశాఖ యంత్రాంగం అప్ర‌మ‌త్తం:
ఇటీవ‌ల క‌డ‌ప‌లో కోవిడ్ తో ఇద్ద‌రు మ‌ర‌ణించిన నేప‌థ్యంలో విశాఖ‌లోనూ జిల్లా యంత్రాంగం అల‌ర్ట్ అయింది. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో విశాఖ కేజీహెచ్‌, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (విమ్స్‌)లోనూ కోవిడ్ వార్డులు, బెడ్ల‌ను సిద్ధం చేశారు. తాజాగా ఇప్పుడు విశాఖ‌లోనే కోవిడ్ కేసు న‌మోద‌వ‌డంతో అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్త‌మయ్యారు. ప్ర‌స్తుతం విమ్స్‌లో 18, కేజీహెచ్ సీఎస్సార్ బ్లాక్‌లో మ‌రో 17 బెడ్ల‌ను అందుబాటులో ఉంచారు. అక్క‌డ అవ‌స‌ర‌మైన అన్ని మందుల‌ను, ఆక్సిజ‌న్ ప్లాంట్లు, మాస్కులు, ర్యాపిడ్ డ‌యాగ్నిస్టిక్ కిట్లు, శానిటైజ‌ర్ల‌ను సిద్ధంగా ఉంచారు. గ‌తంలో (2019 నుంచి 2022 వ‌ర‌కు) విశాఖ‌ప‌ట్నంలో లక్షా 57 వేల 737 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. 1127 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 48 ల‌క్ష‌ల 64 వేల 392 మందికి కోవిడ్ డోసులు వేశారు.

ఆరోగ్య శాఖ అప్రమత్తం:
ఇటీవ‌ల క‌డ‌ప‌లో రెండు కోవిడ్-19 మరణాలు సంభవించడంతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వాస్తవానికి 2022 తర్వాత రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కొన్నాళ్లుగా దేశంలో మ‌రెక్క‌డా కోవిడ్ మ‌ర‌ణాలు లేవు. కానీ అనూహ్యంగా క‌డ‌ప‌లో కోవిడ్ కేసులు వెలుగు చూడ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. జిల్లా కేంద్రాల్లోని ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో కోవిడ్ ఐసోలేష‌న్ వార్డులు ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన అన్నిటిని స‌మ‌కూర్చాల‌ని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. అంతేకాదు., కోవిడ్ మ‌రింత‌గా వ్యాప్తి చెంద‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్‌, టెస్టింగ్ చర్యలను ప్రారంభించింది.

ఆ రెండు మరణాలు ఎలా సంభ‌వించాయి?
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో చేరిన 60 ఏళ్ల వ్యక్తి (క‌డ‌ప జిల్లాకు చెందిన‌) మొదటి బాధితుడు. ఆ తర్వాత అతడిని తమిళనాడు వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ రోగికి మధుమేహం, కిడ్నీ వ్యాధితో సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అతను జూన్ 28న చికిత్స పొందుతూ మరణించాడు. మరణానంతరం నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో అతనికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది . ఆ తర్వాత జూలై 7న కడపలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఆయాసం, నిరంతర దగ్గుతో ఆసుపత్రిలో చేరిన ఆ రోగి, రెండు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినడం, న్యుమోనియా కారణంగా మరణించాడు. అతనికి ఛాతీ సీటీ స్కాన్ చేసినప్పుడు, కోవిడ్-19కు అనుగుణంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే ఈ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌కు చెందిన మరింత తీవ్రమైన రకం కారణమా అనే అనుమానాన్ని కూడా వైద్యులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది ఆందోళన కలిగించే విషయమా?
SARS-CoV-2 యొక్క ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత అంటువ్యాధిగా పరిగణించబడుతుంది. అలాగే ఊపిరితిత్తులలో కూడా వేగంగా వ్యాపిస్తుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మొదట్లో కుప్పకూలిపోయాయి. గత డెల్టా వేవ్‌కు భిన్నంగా, ఒమిక్రాన్ వేవ్ వల్ల పిల్లలు కూడా ప్రభావితమయ్యారు. అయితే, జనాభాలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల, మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు సగటున తక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగించాయి. అయితే తాజాగా కోవిడ్ కేసుల వ్యాప్తి నెమ్మ‌దిగా ఉండ‌డంతో ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు తాజాగా మంగ‌ళ‌గిరిలో ఇద్ద‌రికి, విశాఖ‌ప‌ట్నంలో ఒక‌రికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వీరిలో ఇద్ద‌రు మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. విశాఖ రోగి త‌న ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇలా కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే రాష్ట్రంలో కోవిడ్ కేసులు న‌మోద‌వ‌డంపై ఒకింత ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అధికారిక స‌మాచారాన్ని బ‌ట్టి ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య 11కి చేరింది.

తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల అలెర్ట్‌:
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో రెండు కోవిడ్ మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం, మ‌రో ఎనిమిది మందికి పైగా కోవిడ్ సోక‌డం నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల న‌మోదు, మ‌ర‌ణాల‌తో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌జారోగ్యం, నివారణ వైద్య డైరెక్టరేట్ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఏపీలో కోవిడ్ కేసులు వెలుగు చూడ‌డంతో ఒడిశా ప్ర‌భుత్వం కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు స‌రిహ‌ద్దులో ఉన్న మ‌ల్క‌న్‌గిరి, రాయ‌గ‌డ‌, కొరాపుట్‌, గ‌జ‌ప‌తి, గంజాం, న‌వ‌రంగ‌పూర్ జిల్లా యంత్రాంగాల‌ను అలెర్ట్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో ఒక్క కోవిడ్ కేసు కూడా న‌మోదు కాక‌పోయినా ఏపీలో కోవిడ్ కేసుల‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

Popular Articles