Top 5 This Week

Related Posts

మున్సిపల్ ఏఈ ‘శ్మశాన’ లంచం రూ. 2.00 లక్షలు

పెద్దపల్లి: శ్మశాన వాటిక పనుల్లోనూ ఓ అసిస్టెంట్ ఇంజనీర్ భారీ అవినీతికి పాల్పడిన ఉదంతమిది. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లుల చెల్లింపు అంశంలో కాంట్రాక్టర్ నుంచి రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా పెద్దపల్లి మున్సిపల్ ఆఫీసులో అసిస్టెంట్ ఇంజనీర్ కల్లెపల్లి సతీష్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెడితే.. బాధిత కాంట్రాక్టర్ ఒకరు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని కూనారం రోడ్ లో గల తెనుగువాడ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేశారు. ఇందుకు సంబంధించి తెలంగాణా అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 12.28 లక్షల బిల్లుల చెల్లింపులు రావలసి ఉంది. ఈ అంశంలో అవసరమైన ప్రక్రియను నిర్వహించేందుకు ఏఈ సతీష్ కుమార్ కాంట్రాక్టర్ నుంచి రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా ఆశించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

ఇంట్లో దొరికిన రూ. 31.31 లక్షల నగదుతో ఏఈ సతీష్ కుమార్

బాధిత కాంట్రాక్టర్ నుంచి ఏఈ సతీష్ కుమార్ రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే సందర్భంగా ఏఈ నివాసంలో జరిపిన సోదాల్లో లెక్కల్లో లేని రూ. 32.31 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఏఈ సతీష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది.

Popular Articles