హైదరాబాద్: తెలంగాణా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని 1 లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానలు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు గత రాత్రి మీడియాకు వెల్లడించారు. వాటి వివరాల్లోకి వెడితే..
- వీబీజీ రామ్‌జీ పథకంపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిని పరిగణలోకి తీసుకోకుండా పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గ సమావేశం భావించింది.
- కూలీలకు ఉపాధి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో 2006లో యూపీఏ ప్రభుత్వ హయాంలో తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకంపై గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సమావేశం సుధీర్ఘంగా చర్చించించింది
- నిరుపేదల హక్కుల హరించే విధంగా ఉన్న వీబీజీ రామ్‌జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యధాతథంగా అమలు చేస్తోందని కేబినెట్ భావించింది. గత్యంతరంలేని, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగొద్దని ఆ పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని భావించింది.
- కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియమించడానికి 6,278 పోస్టులు మంజూరు చేసింది.
- ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి LOC లు జారీ చేయాలని కూడా నిర్ణయించారు.
- హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ -1 లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయడానికి మంత్రిమండలి పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఫేజ్-1 ప్రాజెక్టు అబివృద్ధి కోసం రూ. 7,345 కోట్లు మంజూరు చేస్తూ కేబినేట్ ఆమోదం తెలిపినట్టు మంత్రులు మీడియాతో పేర్కొన్నారు

